ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి చేనులో గంజాయి వనం.. ఆరుగురిపై కేసు నమోదు.. ముగ్గురు అరెస్ట్

 ఆసిఫాబాద్  జిల్లాలో పత్తి చేనులో గంజాయి వనం.. ఆరుగురిపై కేసు నమోదు.. ముగ్గురు అరెస్ట్
  •    ఒకే చేనులో 400కు పైగా మొక్కలు
  •     మొత్తం 482 మొక్కలు స్వాధీనం, ఆరుగురిపై కేసు

జైనూర్, వెలుగు: పతి చేను గంజాయి సాగు చేస్తున్న ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లా సిర్పూర్(యు) మండలంలో కలకలం రేపింది. పక్కా సమాచారంతో ఎస్పీ నితికా పంత్  స్వయంగా గంజాయి సాగు చేస్తున్న చేలను పరిశీలించారు. 

శనివారం తెల్లవారుజాము నుంచే బూర్నూర్, గుట్టగూడ గ్రామ శివార్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బూర్నూర్​ గ్రామపంచాయతీ పరిధిలోని జీర్లఘాట్, గుట్టగూడ శివార్లలో వ్యవసాయ భూముల్లో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. 

జీర్లఘాట్  గ్రామంలోని ఓ పతి చేలో 400కు పైగా గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు చేలల్లో దాడులు నిర్వహించారు. మూడు వేర్వేరు చోట్ల 460 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్  చేశారు. జీర్లఘాట్‌‌‌‌‌‌‌‌కు చెందిన గెడం లోబాజీ, గెడాం జైవంత్, కుమ్ర మాధవరావు, గుట్టగూడకు చెందిన పెందోర్  సూర్యభాన్​ను నిందితులుగా గుర్తించారు.

తిర్యాణిలో 22 మొక్కలు..  

తిర్యాణి: కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లా రెబ్బెన సీఐ సంజయ్ కుమార్, తిర్యాణి ఎస్సై సుబ్బారావు ఆధ్వర్యంలో తిర్యాణి మండలం మంగి తాళ్లపేట గూడలో వెడ్మ జంగు చేనులో 15 గంజాయి మొక్కలు, చిన్న అరటిపల్లిలో మేసినేని చంద్రయ్య ఇంటి పెరటిలో 7 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్  చేసి రిమాండ్​కు పంపినట్లు తెలిపారు.