హైదరాబాదులో వృద్ధురాలికి ఇన్సూరెన్స్ అంటగట్టిన బ్యాంక్.. కోర్టు ఎన్ని లక్షలు ఇప్పించిందంటే?

హైదరాబాదులో వృద్ధురాలికి ఇన్సూరెన్స్ అంటగట్టిన బ్యాంక్.. కోర్టు ఎన్ని లక్షలు ఇప్పించిందంటే?

బ్యాంకు అధికారుల మోసపూరిత మాటలతో రూ.10 లక్షలు పోగొట్టుకున్న 73 ఏళ్ల వృద్ధ రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్‌కు తెలంగాణలోని కన్జూమర్ ఫోరం ఊరటనిచ్చింది. ఆమె సమ్మతి లేకుండా బలవంతంగా ఇన్సూరెన్స్ పాలసీ అంటగట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్జూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెస్రల్ కమిషన్.. సదరు ఇన్సూరెన్స్ కంపెనీ, బ్యాంకులకు దిమ్మతిరిగే తీర్పునిచ్చింది. రూ.10 లక్షల అసలు మొత్తంతో పాటు అదనంగా రూ.50 వేల నష్టపరిహారం, రూ.10 వేల కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. 

అమెరికాలో ఉంటున్న తన కుమారుడికి డబ్బులు పంపేందుకు 2023 సెప్టెంబర్ 4న బ్యాంకుకు వెళ్లిన సదరు వృద్ధురాలిని బ్రాంచ్ అధికారులు మోసగించారు. రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నాలుగేళ్ల తర్వాత ఏడాదికి రూ.2లక్షల 67వేలు లాభం వస్తుందని నమ్మించారు. నెలకు కేవలం రూ.57 వేల పెన్షన్ తీసుకునే ఆమె జీతం ఏకంగా రూ.కోటిగా తప్పుడు పత్రాలు సృష్టించారు. బాధితురాలికి తెలియకుండా ఖాళీ కాగితాలు, లోన్ పేపర్లపై సంతకాలు తీసుకుని ఆ మొత్తాన్ని వెంటనే ఇన్సూరెన్స్ పాలసీలో మళ్లించారు. ఇది ఒకేసారి చేసే పెట్టుబడి అని చెప్పి.. అసలు విషయం దాచిపెట్టారు.

ALSO READ : MIVI నుంచి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది..

పాలసీ రద్దు చేసుకునేందుకు ఆమె ప్రయత్నించగా అధికారులు కాలయాపన చేశారు. ఆమె విదేశాల్లో ఉన్న సమయంలో పాలసీ డాక్యుమెంట్లను ఆమె పర్మనెంట్ అడ్రెస్‌కి పంపారు. దీనివల్ల 10 నుంచి 15 రోజుల 'ఫ్రీ-లూక్ పీరియడ్' అంటే పాలసీ నచ్చకపోతే రద్దు చేసుకునే అవకాశాన్ని కోల్పోయేలా చేశారు. ఈ కుట్రపై బాధితురాలు న్యాయవాది A.M. రావు ద్వారా కన్జూమర్ కమిషన్‌ను ఆశ్రయించారు. బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీ తరఫు న్యాయవాదులు తమ తప్పేమీ లేదని వాదించినప్పటికీ.. ఫోరం వాటిని తిరస్కరించింది.

వృద్ధురాలితో వ్యవహరించిన తీరులో పారదర్శకత లోపించిందని, ఇది తీవ్రమైన సేవాలోపమని కమిషన్ స్పష్టం చేసింది. సీనియర్ సిటిజన్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడటం అన్యాయమని పేర్కొంది. బాధితురాలు కోల్పోయిన రూ.10 లక్షలను వెంటనే వాపసు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సో బ్యాంక్ సిబ్బంది, ఇన్సూరెన్స్ ఏజెంట్ల మాటలు నమ్మి పాలసీలు గుడ్డిగా కొనకూడదని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.