న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ దళాల కోసం లోకల్‌గా తయారు చేస్తున్న ఏకే 203 అసాల్ట్ రైఫిల్స్‌కు ఇక నుంచి లోకల్‌గా తయారైన అమ్యూనిషన్ (మందుగుండు) అందనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 7.62x39 మి.మీ మందుగుండు సామగ్రిని సరఫరా చేసేందుకు అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఇండో–-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఆర్‌ఆర్‌పీఎల్) తో ఐదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది.
ఐఆర్‌ఆర్‌పీఎల్ అనేది ఇండియా, రష్యా కంపెనీల మధ్య కుదిరిన ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వా ప్లాంట్‌లో 6,01,427 ఏకే-203 రైఫిళ్లను తయారు చేసేందుకు 2019లో దీనిని ఏర్పాటు చేశారు.
ఈ రైఫిళ్లకు అవసరమైన స్మాల్-క్యాలిబర్ మందుగుండును కాన్పూర్‌లోని తన అధునాతన తయారీ కేంద్రం నుంచి అదానీ డిఫెన్స్ సరఫరా చేయనుంది. తుపాకుల తయారీ, మందుగుండు ఉత్పత్తి రెండూ దేశీయంగానే జరగడంతో రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి మరింత బలం చేకూరుతుందని అదానీ డిఫెన్స్ పేర్కొంది.
