మహాభారత కథ: పెద్దల మాట చద్ది మూట.. వృద్దులను గౌరవించకపోతే దుర్యోధనుడికి పట్టిన గతే పడుతుంది..!

మహాభారత కథ:  పెద్దల మాట చద్ది మూట.. వృద్దులను గౌరవించకపోతే దుర్యోధనుడికి పట్టిన గతే పడుతుంది..!

పెద్దలను గౌరవించవలెను, పెద్దలను ఎదిరించరాదు, పెద్దల మాటలను ఆచరించవలెను...ఈ విధంగా పెద్దల గురించి మన సనాతన ధర్మం ఎంతో గౌరవంగా పలికింది.కాని ఆ మాటలకు ఇప్పుడు విలువే లేదు.

ఇప్పుడే కాదు... మహాభారత కాలం నాడు కూడా పెద్దల మాటలను ఎదిరించడం తెలిసిందే.కురుగురు వృద్ధుల మాటలను, శ్రీకృష్ణుడి సందేశాన్ని అన్నిటినీ పెడ చెవిన పెట్టాడు దుర్యోధనుడు. కురువృద్ధుడైన భీష్ముడిని అనేకమార్లు నిష్ఠూరంగా కూడా మాట్లాడాడు.కురుపాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది.

 ఎనిమిది రోజులు గడిచిపోయినా పాండవులలో ఒక్క మహారథుడూ నేల కూల లేదు. దానితో దుర్యోధనుడికి కోపం వచ్చింది, ‘తాతా! దేవదానవులు కూడా నిన్ను ఎదిరించలేరు కదా. ఎనిమిది రోజులు గడుస్తున్నా పాండవ పక్షంలో ఒక్క మహావీరుడిని కూడా చంపలేదు. నువ్వు తప్పుకో. 

కర్ణుడి సహాయంతో నేను యుద్ధం చేస్తాను’ అని పలికాడు. అనుభవజ్ఞుడు, శాస్త్రాలలో ఆరితేరినవాడు అయిన భీష్ముని అహంకారంతో తూలనాడాడు దుర్యోధనుడు. అప్పుడు భీష్ముడు 
‘తలకొని నీకుం ప్రాణంబులు డాపక 
యోపినట్లు వోరగ నిమ్మై
బలుక దగునె యక్కట నా వలనం గల 
భక్తి యెల్ల వమ్మున గలయన్‌’’ 

(తిక్కన రచించిన మహాభారతం భీష్మ పర్వం, తృతీయాశ్వాసంలోని 175 వ పద్యం)

ఇన్ని రోజులుగా నా ప్రభు భక్తిని ప్రదర్శించి, నేను ప్రాణాలకు తెగించి పోరాడితే, నన్ను ఈ విధంగా తూలనాడతావా’ అని పలికాడు భీష్ముడు. అంతటితో ఆగకుండా అర్జునుడి పరాక్రమం గురించి చెబుతూ‘ఇంద్రుని అమర గణాలను తరిమి, ఖాండవ వనాన్ని దహనం చేశాడు.

 శివునితో యుద్ధం చేసి, ఆయనను మెప్పించి అనేక ఆయుధాలు సాధించాడు. కర్ణుడితో పాటు నీ సోదరులను గంధర్వుల చెర నుంచి విడిపించాడు. ఉత్తర గోగ్రహణం సమయంలో.. ద్రోణాచార్యుడు, ఆయన కుమారుడైన అశ్వత్థామ, కృపుడు, కర్ణుడు మొదలైన వీరులతో  ఒంటరిగా పోరాడి విరాట రాజు గోవులను కాపాడాడు. 

అంతటి శక్తివంతుడైన అర్జునుడితో ఇన్ని రోజులు పోరి, నిలబడిన నేను నీతో ఇన్ని మాటలు అనిపించుకోవలసి వచ్చింది’ అని పలికాడు భీష్ముడు.కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావడానికి ముందే విదురుడు, సంజయుడు, భీష్ముడు వంటి పెద్దలంతా ‘పాండవులతో యుద్ధం తగదు. ధర్మం వారి పక్షాన ఉంది. యుద్ధం జరిగితే కౌరవులు అపజయం పాలవుతారు’ అని పలికారు. 

వినాశ కాలే విపరీత బుద్ధి అన్న చందాన దుర్యోధనుడు వారి మాటలు వినలేదు.ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఒక్కటే – ఎంతో జీవితానుభవం కలిగిన భీష్మాచార్యుని వంటి వారు ఇంటింటా ఉంటారు. వారు పలికే మంచి మాటలను కొత్తతరం వారు వినడానికి సుముఖత చూపరు. ఫలితం అనుభవించిన తరువాత పశ్చాత్తాపం చెందుతారు.

పంచతంత్రం కథలో బోయవాడు -పావురాలు కథ తెలిసిందే. ఒక అడవిలో ఒక బోయవాడు పావురాల కోసమని నేల మీద కొన్ని నూకలు చల్లి, ఆ నూకల మీద వల పన్ని ఉంచాడు. ఆకాశంలో ఎగురుతున్న పావురాలు ఆ నూకలు చూశాయి. అందులో చిన్న వయసు పావురాలు, ‘ఇవిగో, ఇక్కడ చాలా నూకలు ఉన్నాయి. మనం ఈ రోజు ఈ నూకలు తిందాం’ అంటూ ఉత్సాహంగా పలికాయి.  

పావురాల గుంపులో ఒక ముసలి పావురం కూడా ఉంది. ఆ ముసలి పావురానికి ఇటువంటి నూకలు చల్లిన ప్రదేశంలో బోయవాడు తప్పనిసరిగా వాటి మీద వల పన్ని ఉంటాడని తెలుసు. అందువల్ల అది చిన్న పావురాలతో, ‘మీరు తొందరపడకండి. ఆ గింజల మీద వల ఉంటుంది. అందువల్ల మనం ఆ గింజలకు ఆశపడొద్దు. అనవసరంగా వలలో చిక్కుకుని, ఆ బోయవానికి ఆహారం అయిపోతాం’ అని పలికింది.

 చిన్న పావురాలకు ఆ మాటలు నచ్చలేదు. ‘నీకు అన్నీ అనుమానాలే. అక్కడ వల ఏమీ ఉండదు. హాయిగా కడుపు నిండుగా ఆహారం దొరికితే, తినొద్దు అంటావేంటి’ అని ఎదురు ప్రశ్నించాయి. చేసేది లేక ఆ పావురాలతో వృద్ధ పావురం కూడా గింజల మీద వ్రాలింది. అంతే అన్నీ వలలో చిక్కుకున్నాయి. చిన్న పావురాలు ముఖం చిన్నబుచ్చుకున్నాయి. అప్పుడు... వృద్ధ పావురం తన అనుభవంతో ఇచ్చిన సలహాను పాటించిన పావురాలు, బోయవాని వల నుండి తప్పించుకున్నాయి. అందుకే పెద్దల మాట చద్దిమూట అన్నారు.

- డా. పురాణపండ వైజయంతి-