షమీని ఎందుకు పక్కన పెడుతున్నారు?.. అగార్కర్, గంభీర్‌కు మాజీ కోచ్ స్ట్రాంగ్ వార్నింగ్!

షమీని ఎందుకు పక్కన పెడుతున్నారు?.. అగార్కర్, గంభీర్‌కు మాజీ కోచ్ స్ట్రాంగ్ వార్నింగ్!

Mohammed Shami: భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అంతర్జాతీయ కెరీర్‌పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముందుకు సాగిపోయినట్లు కనిపిస్తోంది. గాయాల కారణంతో బాధపడుతున్న షమీ, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత నుంచి గత ఏడాది కాలానికి పైగా టీమిండియా తరపున ఆడలేదు. అంతేకాకుండా గడిచిన మూడేళ్లుగా టెస్టు మ్యాచ్ ఆడనప్పటికీ, డొమెస్టిక్ క్రికెట్‌లో మాత్రం క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటున్నాడు.

ఈ వయసులోనూ ఆకలి తగ్గలేదు: భారత్ అరుణ్ సపోర్ట్

మహమ్మద్ షమీ కోసం టీమిండియా తలుపులు పూర్తిగా మూసివేయకూడదని భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్పష్టం చేశారు. ఒక ఆటగాడు అద్భుతంగా రాణిస్తున్నప్పుడు వయసుతో సంబంధం లేదు.. అతని ప్రతిభకు, సాధించిన విజయాలకు 100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడటం సరైన మైలురాయి. షమీకి రెడ్ బాల్ ఇచ్చినా లేదా ఏ బంతి ఇచ్చినా రన్ అప్ గుర్తించి బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అతనిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉందని భరత్ అరుణ్ కొనియాడారు.

దులీప్ ట్రోఫీ ఫైనల్‌తో 100వ మ్యాచ్: 

దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌లో ఈస్ట్ జోన్ తరఫున ఆడటంతో షమీ తన కెరీర్‌లో 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను (భారత్ తరఫున ఆడిన 64 టెస్టులతో కలిపి) పూర్తి చేసుకోనున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 99 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు 26.30 సగటు నమోదు చేయగా, టెస్టుల్లో 27.71 సగటుతో రాణించాడు. ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా టీమిండియాలో ఆడే అవకాశం రాకపోయినా, డొమెస్టిక్ మ్యాచ్‌ల్లోనూ షమీ చూపిస్తున్న పట్టుదల, భారత జట్టులోకి మళ్లీ పునరాగమనం చేయాలనే ఆకలి స్పష్టంగా కనిపిస్తోందని తెలిపాడు.

షమీ కంబ్యాక్ సాధ్యమేనా?: 

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేస్ విభాగాన్ని ముందుండి నడిపించిన మహమ్మద్ షమీ, 13 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. జాతీయ జట్టులో అవకాశాలు తగ్గినప్పటికీ డొమెస్టిక్ టోర్నీలు, ఐపీఎల్‌లలో నిలకడగా రాణిస్తున్న ఈ స్టార్ స్పీడ్‌స్టర్‌ను సెలెక్టర్లు మళ్లీ పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనేది క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.