నాగర్ కర్నూల్/వనపర్తి/కోడేరు,(పెద్దకొత్తపల్లి), వెలుగు : తెలంగాణ మహిళలు ఆర్థికంగా బలపడేలా ఉపాధి, వ్యాపార అవకాశాలను సృష్టిస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ప్రజా ప్రభుత్వం1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాలను కేవలం పొదుపు, రుణాలకే పరిమితం చేయకుండా వ్యాపార రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. అంగన్‌వాడీ, స్కూల్ యూనిఫామ్‌ల తయారీతో పాటు వరి కొనుగోలు కేంద్రాలు, సోలార్ విద్యుత్ యూనిట్ల ద్వారా మహిళలకు అదనపు ఆదాయం సమకూరుతోందని, జిల్లా కేంద్రంలో రూ.6 కోట్లతో ఇందిర మహిళా శక్తి భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, అన్ని రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించామని, అదనంగా మరో రూ.100 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. జటప్రోల్‌లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు త్వరలో ‘ప్రభాతభేరి’ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పాలన అందిస్తున్నామని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా పెద్దకొత్తపల్లి మండలం నక్కలబండ స్టేజి వద్ద రూ.15.87 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణాలు, బాచారం గ్రామంలో 257 చెంచు కుటుంబాల పునరావాసం కోసం ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు రూ.175 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులతో పాటు గొర్రె పిల్లలు, నాటుకోడి పిల్లలను పంపిణీ చేశారు.
ప్రజలకు మెరుగైన సంక్షేమం
వనపర్తిలో రూ.69కోట్లతో నిర్మించనున్న హ్యామ్ ప్రాజెక్టు రోడ్లకు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. పట్టణంలో పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ప్రజలకు మెరుగైన సంక్షేమం అందిస్తోందని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన అభివృద్ధికి, తాము చేస్తున్న సంక్షేమానికి మధ్య తేడాను ప్రజలే గమనించాలని సూచించారు. మంత్రిజూపల్లి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శివసేనారెడ్డి తదితర నేతలు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
