‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘తెల్ల కాగితం’. నక్షత్ర హీరోయిన్. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుంది. శనివారం టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, దర్శకుడు బాబీ అతిథులుగా హాజరై ఇదొక ఇన్నోసెంట్ లవ్‌స్టోరీ అని, అందరికీ నచ్చుతుందని అన్నారు.
ఈ సందర్భంగా హర్ష్ రోషన్ మాట్లాడుతూ ‘ఇదొక సినిమా మాత్రమే కాదు.. ఓ మంచి ఫీలింగ్. ఇది మనందరి కథ. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ. ప్యూర్, ఇన్నోసెంట్, ఎమోషనల్ లవ్ స్టోరీ. కొన్ని సినిమాలు గుర్తుపెట్టుకుంటాం, మరికొన్ని సినిమాలు ఫీల్ అవుతాం.. ఇలా అలాంటి ఫీలింగ్ ఇచ్చే సినిమా’ అని చెప్పాడు. అందరికీ రిలేట్ అయ్యే చిత్రమిది అని హీరోయిన్ నక్షత్ర చెప్పింది.
డైరెక్టర్ రమేష్ బండ్రెడ్డి మాట్లాడుతూ ‘మన అందరి జీవితాల్లో కొన్ని దశలుంటాయి. అందరూ మా తెల్ల కాగితం దశను దాటే వచ్చుంటారు. స్ట్రాంగ్ కంటెంట్‌తో రాబోతున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం’ అని అన్నాడు. నటులు అజయ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రఘురాం, రైటర్ నందు సవిరిగాన సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
