ఒక్క ఓటు కూడా తగ్గొద్దుపార్టీ శ్రేణులకు సీఎం పిలుపు

ఒక్క ఓటు కూడా తగ్గొద్దుపార్టీ శ్రేణులకు సీఎం పిలుపు
  • ఓట్ల తొలగింపుతో బీజేపీ దొంగ దెబ్బ తీయాలని చూస్తోందని ఫైర్​
  • ‘సర్’పై కొడంగల్ ​నియోజకవర్గ లీడర్లతో సీఎం సమావేశం

కొడంగల్, వెలుగు: నియోజకవర్గంలోని ప్రతి బూతులో ఒక్క ఓటు కూడా తగ్గకుండా చూడాలని సీఎం రేవంత్​రెడ్డి పార్టీ కేడర్​పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్​జిల్లా కొడంగల్​లోని సీఎం నివాసంలో నియోజకవర్గ కాంగ్రెస్​లీడర్లతో 'సర్'పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 'సర్' పేరుతో ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను టార్గెట్ చేసి, మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ ఎన్నికల్లో మాదిరి గెలువాలనే ప్రయత్నం చేస్తోందన్నారు.

తెలంగాణలో దొంగదెబ్బ తీస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరన్నారని హెచ్చరించారు. కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించాలని చూస్తున్నారని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను బీజేపీ టార్గెట్ చేస్తోందని తెలిపారు. గతంలో ఓడించేందుకు ఈడీ, సీబీఐ ఉపయోగించేవారని, ఇప్పుడు ఓట్ల తొలగింపుతో తడిగుడ్డతో గొంతు కోసే చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు ఈ కుట్రకు బీఆర్ఎస్​కూడా బీజేపీకి మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు.

ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. ప్రజల ఓట్లు కాపాడాల్సిన బాధ్యత ముఖ్య నాయకులదేనని చెప్పారు. గ్రామాలవారీగా బీఎల్వోలను సమన్వయం చేసుకుని పేదల ఓట్లు తొలగించకుండా చూడాలన్నారు. ప్రతి నాలుగు గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. అందరూ అప్రమత్తంగా ఉంటూ బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పి కొట్టాలని సీఎం పిలుపునిచ్చారు.