ప్రతి విద్యార్థికీ సమాన అవకాశాలు దక్కాలి..యూనివర్సల్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌‌‌‌ను నిర్మిద్దాం: రాహుల్ గాంధీ పిలుపు

ప్రతి విద్యార్థికీ సమాన అవకాశాలు దక్కాలి..యూనివర్సల్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌‌‌‌ను నిర్మిద్దాం: రాహుల్ గాంధీ పిలుపు

న్యూఢిల్లీ:ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు, నాణ్యమైన విద్యను అందించే వ్యవస్థను నిర్మించాలని టీచర్లకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. శనివారం నేషనల్ టీచర్స్ డే సందర్భంగా టీచర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌‌‌‌’లో పోస్టు పెట్టారు.

 ‘‘మీ జ్ఞానం, సేవ, అంకితభావం ద్వారా మీరు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. రాబోయే తరాలకు దిశను నిర్దేశిస్తారు.- మీ సహకారం అమూల్యమైనది”అని కొనియాడారు. ‘‘ఈరోజు, భారతదేశ విద్యా వ్యవస్థ మన ముందు అనేక తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య, ఉజ్వల భవిష్యత్తు లభించే వ్యవస్థను మనం కలిసి నిర్మించాలి’’ అని ఆయన పేర్కొన్నారు. 

మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (టీచర్స్ డే) సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా టీచర్లకు, మాజీ రాష్ట్రపతికి నివాళులు అర్పించారు. ‘‘టీచర్లు మనుషులను తీర్చిదిద్దుతారు, విలువలను పెంపొందిస్తారు, మన దేశ భవిష్యత్తుకు పునాదులు వేస్తారు’’ అని ఆయన ‘ఎక్స్‌‌‌‌’లో పేర్కొన్నారు. డాక్టర్ రాధాకృష్ణన్‌‌‌‌ ప్రముఖ తత్వవేత్త, ఉపాధ్యాయుడు, రాజనీతిజ్ఞుడు అని.. ఆయన జ్ఞానం ఎప్పటికీ నిత్యనూతనంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటుందని రాహుల్ గాంధీ  కొనియాడారు.