- ట్యూషన్ ఫీజుకు అదనంగా రూ.75 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు బాదుడు
- రశీదులు లేకుండా క్యాష్ కట్టాలంటూ స్టూడెంట్స్పై యాజమాన్యాల ఒత్తిడి
- టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌కు పేరెంట్స్ అసోసియేషన్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ల పేరుతో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని ‘పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్’ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ట్యూషన్ ఫీజు కాకుండా.. అడ్మిషన్ రిపోర్టింగ్ సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి నిబంధనలకు విరుద్ధంగా రూ.75 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు అదనంగా డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదనంగా వసూలు చేస్తున్న మొత్తానికి ఎలాంటి రశీదులు ఇవ్వకుండా కేవలం నగదు రూపంలోనే చెల్లించాలని కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఒకవేళ సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్‌లో వేరే కాలేజీకి సీటు మారుతే, అక్కడ కూడా మళ్లీ అదనపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫీజుల దోపిడీపై టీఏఎఫ్‌ఆర్‌సీ తక్షణమే స్పందించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రశీదులు లేకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
