నేపాల్ జలప్రళయంలో గల్లంతైన వారి కోసం.. డీఎన్‌‌‌‌ఏ పరీక్షలే చివరి ఆశ

నేపాల్ జలప్రళయంలో గల్లంతైన వారి కోసం.. డీఎన్‌‌‌‌ఏ పరీక్షలే చివరి ఆశ
  • వరద ప్రవాహంలో మృతదేహాలు ఛిద్రం
  • అయిన వాళ్ల డెడ్ బాడీలను గుర్తుపట్టలేక పోతున్న రిలేటివ్స్
  • 2 వేలకు పైగా శాంపిల్స్ సేకరణ
  • నేపాల్‌‌‌‌లో ఎటుచూసినా హృదయ విదారక దృశ్యాలే

ఖాట్మాండు: నేపాల్ జలప్రళయంలో గల్లంతైన తమ వారి కోసం వెతుకుతున్న వందలాది కుటుంబాలకు ఇప్పుడు డీఎన్‌‌‌‌ఏ పరీక్షలే చివరి ఆశగా మారాయి. వరద ప్రవాహంలో శరీరాలు ఛిద్రమై, కేవలం అవయవాలు మాత్రమే లభ్యమవుతుండటంతో బాధితులను గుర్తించడం అధికారులకు పెను సవాలుగా మారింది. వరద నీటిలో రోజుల తరబడి నానిపోవడం, బురద-రాళ్ల తాకిడికి మృతదేహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖాలు గుర్తుపట్టే స్థితిలో లేకపోవడం, కేవలం తెగిపడిన శరీర భాగాలు మాత్రమే లభ్యమవుతుండటంతో సంప్రదాయ గుర్తింపు పద్ధతులు విఫలమవుతున్నాయి. దీంతో నేపాల్ పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌‌‌‌ల ద్వారా డీఎన్‌‌‌‌ఏ పరీక్షలపై ఆధారపడుతున్నారు. 

ఇప్పటివరకు మృతదేహాల నుంచి 1,260, బాధిత బంధువుల నుంచి 1,012 కలిపి మొత్తం 2,272 డీఎన్‌‌‌‌ఏ నమూనాలను సేకరించారు. శాంపిల్స్‌‌‌‌ సేకరించిన అనంతరం 1,030 మృతదేహాలను అధికారులు సామూహిక ఖననం చేశారు. వీటిలో 453 మృతదేహాలు మహిళలవో, పురుషులవో కూడా నిర్ధారించలేని స్థితిలో ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 96 మృతదేహాలను మాత్రమే శాస్త్రీయంగా గుర్తించి.. బంధువులకు అప్పగించారు. బాధిత కుటుంబాలు రాజధాని ఖాట్మాండు వరకు రానవసరం లేకుండా నువాకోట్‌‌‌‌లోని బిదూర్‌‌‌‌లో ప్రత్యేక డీఎన్‌‌‌‌ఏ సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

అలాగే, గుర్తించని 1,270 మృతదేహాల వివరాలు, ఆనవాళ్లను నేపాల్ పోలీస్ అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. రక్తసంబంధీకుల డీఎన్‌‌‌‌ఏతో సరిపోల్చిన తర్వాతే శరీర భాగాలను కుటుంబాలకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య 1,300, ఇప్పటికీ ఆచూకీ చిక్కని వారి సంఖ్య 5 వేలు దాటింది. జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో గల్లంతైన దాదాపు 900 మంది కార్మికుల్లో సుమారు 500 మంది లోపలే చిక్కుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. వారి కోసం భారత్, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలకు చెందిన నిపుణులు స్థానిక దళాలతో కలిసి తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

పది రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు..

భీకర వరదలతో అతలాకుతలమైన నేపాల్‌‌‌‌లో మృత్యువుపై పోరాడి ప్రాణాలతో బయటపడ్డ అద్భుత ఘట్టాలు వెలుగుచూస్తున్నాయి. మట్టి దిబ్బలు, విరిగిపడ్డ కాంక్రీట్ శిథిలాల కింద రోజుల తరబడి నరకం అనుభవించిన ఇద్దరు వ్యక్తులు శనివారం క్షేమంగా బయటపడ్డారు. త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్టుకు అనుసంధానమైన 225 మీటర్ల పొడవైన సొరంగంలో చిక్కుకుపోయిన లుహైతావో అనే చైనా జాతీయుడిని నేపాల్ సైన్యం, దక్షిణ కొరియా విపత్తు నిర్వహణ నిపుణులు సంయుక్తంగా శ్రమించి రక్షించారు. ఒళ్లంతా మట్టి, తీవ్ర అలసటతో ఉన్నప్పటికీ అతడు స్పృహలోనే ఉన్నాడు. సైనికుల భుజాలపై ఆసరాగా నడుస్తూ బయటకు వచ్చిన అతడిని హెలికాప్టర్ ద్వారా ఖాట్మాండులోని ఆసుపత్రికి తరలించారు. 

ఇదే ప్లాంట్‌‌‌‌లో శుక్రవారం ఇద్దరు నేపాలీ కార్మికులను ప్రాణాలతో బయటకు తీసిన సంగతి తెలిసిందే. మరోవైపు, నువాకోట్ పట్టణంలో నేలమట్టమైన ఓ భవన శిథిలాల నుంచి 64 ఏండ్ల చండిక శ్రేష్ఠ అనే మహిళను రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. దుప్పటిలో చుట్టి తీసుకొచ్చిన ఆమెను అత్యవసర వైద్య చికిత్స కోసం వెంటనే రాజధానికి ఎయిర్‌‌‌‌లిఫ్ట్ చేశారు. దీంతో ఇటీవలి సహాయక చర్యల్లో ప్రాణాలతో బయటపడ్డ వారి సంఖ్య నాలుగుకు చేరింది. 

పుట్టెడు దుఃఖాన్ని  దిగమింగి..

ఆకస్మిక వరదల్లో కన్నవారు, కట్టుకున్నవారు కొట్టుకుపోయి గుండె పగిలే శోకంలో ఉన్నప్పటికీ.. ఆ బాధను దిగమింగుకుని తోటివారిని కాపాడేందుకు పలువురు నేపాల్ వరద బాధితులు నడుం బిగించారు. ఈ విలయంలో తన కళ్లముందే తమ్ముడిని కోల్పోయిన రసువాకు చెందిన సుదీప్ కుమార్.. భార్య, ఏడేళ్ల కూతురు సహా నలుగురు కుటుంబ సభ్యులు గల్లంతైన నువాకోట్‌‌‌‌కు చెందిన సుచిత్ జోషిలాంటి బాధితులు తమ ఆత్మీయుల కోసం గాలిస్తూనే, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నిరాశ్రయులైన గ్రామస్తులకు ఆహారం పంపిణీ చేయడం, వరదల్లో చిక్కుకున్న వృద్ధులను రక్షించడం లాంటి సేవ చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.