బోధన్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు ప్రింటింగ్..మీసేవ ఓనర్, ఆపరేటర్ అరెస్ట్

బోధన్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు ప్రింటింగ్..మీసేవ ఓనర్, ఆపరేటర్ అరెస్ట్
  • రూ.10 వేలకు బర్త్, మ్యారేజీ సర్టిఫికెట్లు, టీసీ, బోనాఫైడ్
  • వివరాలు వెల్లడించిన  సీపీ సాయిచైతన్య 

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా బోధన్​ కేంద్రంగా మీ సేవ సెంటర్​లో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఓనర్, ఆపరేటర్​ పోలీసులకు పట్టుబడ్డారు. శనివారం సీపీ సాయి చైతన్య మీడియాకు వివరాలు వెల్లడించారు.  రాకాసీపేటలోని సహారా మీ సేవ సెంటర్​ ఆపరేటర్​ షేక్​ వసీం ఈజీ మనీ కోసం నకిలీ సర్టిఫికెట్లు ఎలా తయారు చేయాలో  నేర్చుకున్నాడు. 

ఈ విషయాన్ని ఓనర్​ మహ్మద్  ముక్రంకు చెప్పి పార్ట్​నర్​షిప్​లో దందా చేద్దామని ఒప్పించాడు. తరువాత ఇద్దరు కలిసి ఏజెంట్లను నియమించుకొని గవర్నమెంట్​ నుంచి చేయూత పెన్షన్లు పొందేందుకు నకిలీ బర్త్​ సర్టిఫికెట్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి స్కీమ్​ లబ్ధి పొందేందుకు మ్యారేజ్​ సర్టిఫికెట్లు, జాబ్స్​ కోసం నకిలీ టీసీ, బోనాఫైడ్స్​ తయారు చేసేవారు. 

ప్రతి సర్టిఫికెట్​కు రూ.5 వేల నుంచి రూ.10 వేలు తీసుకునేవారు. ఇలా రెండేండ్ల నుంచి నకిలీ సర్టిఫికెట్ల బిజినెస్​ చేశారు. పక్కా సమాచారంలో నిఘా పెట్టి నిందితులను అరెస్ట్​ చేసినట్లు సీపీ తెలిపారు.  వారి నుంచి ఐదు నకిలీ మీసేవ సర్టిఫికెట్లు, 22 నకిలీ బర్త్​ సర్టిఫికెట్ల జిరాక్స్​లు, 13 నకిలీ టీసీ, బోనాఫైడ్స్, షాదీముబారక్​ స్కీమ్​ కోసం సిద్ధం చేసిన జిరాక్స్​లు, రబ్బర్​ స్టాంప్, ల్యాప్​టాప్, ప్రింటర్​ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 

నకిలీ పత్రాలు పొందిన వ్యక్తులు వాటిని ఎక్కడ  ఉపయోగించారో? ఆరా తీస్తున్నామని తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లు కావాలని అడగడం కూడా నేరమేనని స్పష్టం చేశారు. బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​, సీసీఎస్​ ఇన్​స్పెక్టర్  శ్రీశైలం, సీఐ వెంకటనారాయణ ఉన్నారు.