జీరంఘాటీ కేసులో పది మంది దోషులుగా నిర్దారణ..13 ఏళ్ల తర్వాత జగదల్ పూర్ ఎన్ఐఏ కోర్టులో విచారణ పూర్తి

జీరంఘాటీ కేసులో పది మంది దోషులుగా నిర్దారణ..13 ఏళ్ల తర్వాత జగదల్ పూర్ ఎన్ఐఏ కోర్టులో విచారణ పూర్తి
  • శిక్షలపై నిర్ణయం ఈ నెల 16కు వాయిదా

భద్రాచలం, వెలుగు: 2013 మే 25న ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జీరంఘాటీలో మావోయిస్టుల హత్యాకాండలో జగదల్​పూర్ లోని ఎన్ఐఏ కోర్టు శనివారం 10 మందిని దోషులుగా నిర్ధారించింది. 13 ఏళ్ల తర్వాత నిర్ధారణకు వచ్చిన కోర్టు శిక్షలపై నిర్ణయాన్ని ఈనెల 16కు వాయిదా వేసింది. 

పరివర్తన యాత్ర కాన్వాయ్​లో వెళ్తున్న సల్వాజుడుం వ్యవస్థాపక అధ్యక్షుడు మహేంద్రఖర్మ, ఛత్తీస్​గఢ్​ పీసీసీ అధ్యక్షుడు నందకుమార్  పటేల్, మాజీ కేంద్ర మంత్రి వీసీ శుక్లా సహా 29 మంది కాంగ్రెస్​ నేతలు మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో చనిపోయారు.

 ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. కోర్టు 101 మంది సాక్షుల వాంగ్మూలాన్ని సేకరించింది. గత ఆగస్టు నెలలోనే విచారణ పూర్తి చేసింది. 11 మందిని దోషులుగా తేల్చగా, అందులో ఒకరు విచారణ సమయంలో చనిపోయారు. ప్రమీలా కోడియం అలియాస్​ జ్యోతి, బంజా అలియాస్  సన్నా, ఆయతే మరకాం, ముక్కా మండావి, మడకం దేవా, కవ్వాసి కోసా, చైతూ అలియాస్​ మున్నా, కోస, మహాదేవ్​ నాగ్, సుమిత్రాను దోషులుగా గుర్తించారు.

 కాగా దీనిపై సల్వాజుడుం వ్యవస్థాపక అధ్యక్షుడు మహేంద్రఖర్మ కుమార్తె తూలికా ఖర్మా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్​కు వెళ్లి తొలి ఫిర్యాదు చేసిన తనను విచారించలేదన్నారు. ఛత్తీస్​గఢ్​ మాజీ సీఎం భూపేశ్​ బదేల్  కూడా ఇదే తరహాలో స్పందించారు. మావోయిస్టు అగ్రనేతలను తప్పించారని ఆయన ఆరోపించారు. ఈనెల 16న శిక్షలపై తీర్పు వచ్చాక పరిశీలించి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు నిందితుల తరుపు న్యాయవాది తెలిపారు.