సత్తుపల్లి, వెలుగు: మహిళలు స్వతంత్రంగా జీవిస్తూ, ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులుగా మారాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 1000 రోజుల ప్రజా పాలనలో భాగంగా నిర్వహించిన ఇందిర మహిళాశక్తి సదస్సులో కలెక్టర్ దివాకర, ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి గత రెండున్నరేళ్లలో పంచాయతీరాజ్, మహిళా సంఘాల సంక్షేమం, తాగునీరు తదితర రంగాల్లో సుమారు రూ.300 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. మహిళా సంఘాలు కేవలం పొదుపు, రుణాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి రావాలని పిలుపునిచ్చారు.
సత్తుపల్లిలో కూడా టిఫిన్ సెంటర్లు, క్యాంటీన్లు, డెయిరీ, పౌల్ట్రీ, సోలార్, కుట్టు యూనిట్లు, స్థానికంగా లభించే అటవీ ఉత్పత్తుల ఆధారంగా వివిధ వ్యాపారాలు ప్రారంభించాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఒకే రంగానికి పరిమితం కాకుండా వివిధ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోకి అడుగుపెట్టి ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రెహ్మన్ బేగం, కల్లూరు ఏసీపీ వసుంధర పాల్గొన్నారు.
