ఖమ్మంలో సైబర్ క్రైమ్ స్పెషల్ ఆపరేషన్.. 10 మ్యూల్ ఖాతాలు ఇచ్చిన ఇద్దరి అరెస్ట్

ఖమ్మంలో సైబర్ క్రైమ్ స్పెషల్ ఆపరేషన్.. 10 మ్యూల్ ఖాతాలు  ఇచ్చిన ఇద్దరి అరెస్ట్

121 ఖాతాల్లో రూ.7.84 కోట్ల లావాదేవీలు!

ఖమ్మం, వెలుగు: సైబర్‌‌‌‌ నేరాల కట్టడిలో భాగంగా ఖమ్మం జిల్లాలో సైబర్‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు స్థానిక పోలీసులతో కలిసి స్పెషల్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌ నిర్వహించారు. బుధ, గురువారాల్లో జిల్లా వ్యాప్తంగా 11 బృందాలుగా ఏర్పడి 40 మంది పోలీసులు, సిబ్బంది బ్యాంకులు, ఏటీఎంలు, అనుమానిత ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. గతంలో నమోదైన సైబర్‌‌‌‌ నేరాలకు సంబంధించి 10 మ్యూల్‌‌‌‌ ఖాతాలు సమకూర్చిన ఇద్దరు నిందితులను అరెస్ట్‌‌‌‌ చేశారు.

సైబర్‌‌‌‌ మోసాల ద్వారా వచ్చిన డబ్బును స్వీకరించడంతో పాటు ఇతర ఖాతాలకు బదిలీ చేసేందుకు ఈ మ్యూల్‌‌‌‌ ఖాతాలను వినియోగించినట్లు దర్యాప్తులో గుర్తించారు. విదేశాల్లోని చైనా ఆపరేటర్లతో కలిసి నిర్వహిస్తున్న టెలిగ్రామ్‌‌‌‌ గ్రూపుల ద్వారా అనధికారిక చెల్లింపులకు కూడా ఈ ఖాతాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.

121 మ్యూల్‌‌‌‌ ఖాతాల గుర్తింపు..

ఖమ్మం జిల్లా వి.ఎం.బంజర, సత్తుపల్లి పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో నమోదైన సైబర్​ కేసులను సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ బ్యూరోకు బదిలీ చేశారు. ఈ కేసుల్లో గతంలో 52 మందిని అరెస్ట్‌‌‌‌ చేయగా, తాజాగా బాదిస మురళీకృష్ణ, వడ్లమూడి సాయినివాస్‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌ చేశారు. ఆపరేషన్‌‌‌‌లో భాగంగా జిల్లాలోని 30 బ్యాంకు శాఖల్లో 121 మ్యూల్‌‌‌‌ ఖాతాలను గుర్తించారు. ఏటీఎం విత్‌‌‌‌డ్రాలకు సంబంధించి 273 ఖాతాలను, రూ.20 వేలకుపైగా చెక్‌‌‌‌ విత్‌‌‌‌డ్రాలో పాల్గొన్న 12 ఖాతాలను గుర్తించారు.

ఈ ఖాతాల ద్వారా మొత్తం రూ.7.84 కోట్ల లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. స్పెషల్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌ అనంతరం జిల్లాలోని ఎనిమిది పోలీస్‌‌‌‌స్టేషన్లలో 25 ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లు నమోదు చేశారు. డీఎస్పీ కేవీఎం ప్రసాద్‌‌‌‌, సీసీపీఎస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ ఫణీందర్‌‌‌‌, సూర్యాపేట డీఎస్పీ వెంకటయ్య తదితరులు 
పాల్గొన్నారు.