ప్రపంచ పటం మారింది. ఇన్నాళ్లుగా మనం చూస్తున్న వరల్డ్ మ్యాప్ లో కొన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కొన్ని దేశాలు ఖండాలు చిన్నగా, మరికొన్ని పెద్దగా మారబోతున్నాయి. 2026 సెప్టెంబర్ 4వ తేదీన ఐక్యరాజ్య సమితి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొత్త వరల్డ్ మ్యాప్ కు అనుకూలంగా జనరల్ అసెంబ్లీ తార్మానం చేసింది.
ఖండాల పరిమాణాన్ని మరింత కచ్చితంగా ప్రతిబింబించే ప్రొజెక్షన్‌తో మెర్కేటర్ ప్రపంచ పటాన్ని రీప్లేస్ చేయడానికి ఐక్యరాజ్యసమితి ఈక్వల్ ఎర్త్ మ్యాప్ కు జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది. కొత్త మ్యాప్ ప్రకారం.. ఆఫ్రికా గణనీయంగా పెద్దదిగా, యూరప్, ఉత్తర అమెరికా చిన్నవిగా కనిపిస్తాయి. టోగో నేతృత్వంలో, ఆఫ్రికన్ యూనియన్ మద్దతుతో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం 164-1 ఓట్లతో ఆమోదం పొందింది. ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక దేశం అమెరికా.
అయితే ఈ నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా విమర్శించింది.
16వ శతాబ్దం నాటి వరల్డ్ మ్యాప్ పై కాకుండా, ప్రపంచ సవాళ్లపై ఐక్యరాజ్యసమితి దృష్టి పెట్టాలని సూచించింది. ఇటువంటి చర్యల వల్లే ఈ సంస్థ తన విశ్వసనీయతను కోల్పోతోందని యూఎస్ ప్రతినిధి యరీనా ఫెరెన్సెవిచ్ అన్నారు.
కచ్చితమైన పరిమాణాలతో తీసుకొచ్చిన ప్రపంచ పటం ఆమోదం పొందటం చారిత్రాత్మక అడుగుగా ఆఫ్రికన్ యూనియన్ స్వాగతించింది. 2018లో అభివృద్ధి చేసిన ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ ను ప్రోత్సహిస్తూ దేశాలు, ఖండాల పరిమాణాన్ని ఖచ్చితంగా పోల్చడం ముఖ్యమైన పరిణామంగా మెజారిటీ సభ్య దేశాలు పేర్కొన్నాయి.
మెర్కేటర్ మ్యాప్ అంటే ఏమిటి?
మెర్కేటర్ ప్రొజెక్షన్‌ను 1569లో ఫ్లెమిష్ మ్యాప్ నిర్మాత గెరార్డస్ మెర్కేటర్ అభివృద్ధి చేశారు. దీన్ని ప్రధానంగా సముద్రయానం కోసం, దిశలను, కోణాలను కాపాడుతూ రూపొందించారు. తద్వారా నావికులు తమ మార్గాలను కచ్చితంగా గీయగలిగేవారు.
కానీ భూమి వక్ర ఉపరితలాన్ని ఒక సమతల పటంగా మార్చడం వక్రీకరణకు దారితీస్తుందనే ఆరోపణలున్నాయి. మెర్కేటర్ ప్రొజెక్షన్, భూమధ్యరేఖ నుండి ధ్రువాల వైపు వెళ్లేకొద్దీ భూభాగాలను మరింత పెద్దదిగా చూపిస్తుంది. దీనివల్ల ఉత్తర ప్రాంతాలు ఉన్నదానికంటే చాలా పెద్దవిగా కనిపిస్తాయి, అయితే ఆఫ్రికాలోని చాలా భాగంతో సహా భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు చిన్నవిగా కనిపిస్తాయి.
దీనికి స్పష్టమైన ఉదాహరణ గ్రీన్‌ల్యాండ్, ఆఫ్రికా. అనేక మెర్కేటర్ పటాలలో, గ్రీన్‌ల్యాండ్ పరిమాణంలో దాదాపు ఆఫ్రికాతో సమానంగా కనిపిస్తుంది. వాస్తవానికి, ఆఫ్రికా గ్రీన్‌ల్యాండ్ కంటే సుమారు 14 రెట్లు పెద్దది. అంతేకాకుండా, ఈ ప్రొజెక్షన్ ఆఫ్రికా, దక్షిణ అమెరికా , ఆసియాలోని కొన్ని ప్రాంతాలతో పోలిస్తే యూరప్, ఉత్తర అమెరికా, రష్యా దేశాలు పెద్దవిగా కనిపించడం ఇప్పటి వరకు ఉన్న మ్యాప్ లో గమనించవచ్చు.
మెర్కేటర్ పటం భౌగోళికంగా తప్పు కాదు.. కానీ నావిగేషన్ కోసం దాంట్లో కొన్ని వక్రీకరణలు ఉన్నప్పటికీ ప్రపంచ దేశాలు అంగీకరించాయి. క్లాస్ రూమ్స్ లో, ఆఫీసుల్లో , కమ్యూనికేషన్, మీడియా మొదలైన వాటిలో కూడా అదే మ్యాప్ వినియోగించడంపై విమర్శ ఉంది. అందుకే ఈ కొత్త మ్యాప్ ద్వారా అలాంటి వక్రీకరణలు లేకుండా వాస్తవ సరిమాణంలో దేశాలు, ఖండాలు కనిపించేలా రూపొందించారు.
