- కాంగ్రెస్‌లో కొనసాగాలంటే ఫ్యూచర్లో అలా మాట్లాడొద్దు
- అంతర్గత విషయాలను బహిరంగంగా విమర్శించొద్దు
- పీసీసీ లేదా రాహుల్‌తో నేరుగా సమస్య చెప్పొచ్చు
- ఢిల్లీలో మీడియాతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
- ఢిల్లీలో మీడియాతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగే విధంగా వ్యవహరించడం వల్లే కొండా సురేఖపై అధిష్టానం చర్యలు తీసుకున్నదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. కొండాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం బాధాకరమేనని తెలిపారు. ఈ విషయంలో తమ చేతిలో ఏమీ లేదని, గతంలో రెండు సార్లు ఫిర్యాదులు వచ్చినప్పుడు సీఎంతో మాట్లాడినట్లు గుర్తు చేశారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో కులాలు, మతాలకు తావు ఉండదని స్పష్టం చేశారు. క్రమశిక్షణ సంఘం ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే కొండా సురేఖ, చిన్నారెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇకపై ఎవరూ క్రమశిక్షణ ఉల్లంఘించినా ఇదే రీతిలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శుక్రవారం ఢిల్లీలోని శబరి బ్లాక్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బర్తరఫ్ తర్వాత కొండా సురేఖ ఆవేశం, ఆవేదనతో మాట్లాడారన్నారు. ఇకపై ఆ విధంగా మాట్లాడొద్దని సూచించారు. పార్టీలో ఏదైనా సమస్య ఉంటే.. పీసీసీ, జనరల్ సెక్రటరీ, రాహుల్ గాంధీతో కూడా మాట్లాడవచ్చన్నారు. బహిరంగ వేదికలపై విమర్శలు చేయవద్దని, వాటిని కాంగ్రెస్ పార్టీ అనుమతించదన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని నమ్ముకున్న పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎప్పడూ ప్రాధాన్యం ఉంటుందన్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి రావాలి
వెయ్యి రోజుల పాలన విజయాలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మహేశ్ గౌడ్ అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడం వల్ల ప్రతిపక్ష నేత హోదాకు అర్థం లేకుండా పోయిందన్నారు. ఇకనైనా అసెంబ్లీకి వచ్చి తన అనుభవాలు పంచుకోవాలని, తన వాదన వినిపించాలని హితవుపలికారు. బీఆర్ఎస్ సర్కార్ తమ నెత్తిపై అప్పులు పెట్టి దిగిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నదన్నారు.
రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు దాటుతం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు దాటుతుందని మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సీనియర్లు, పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు. సీనియర్లకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు వెల్లడించారు. జిల్లాలకు ప్రాధాన్యం ఉండాలని కోరుకునే వాళ్లలో తాను మొదటి వ్యక్తిని, మంత్రి వర్గ విస్తరణ జరిగితే అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పారు. గెలిచిన వాళ్లంతా మంత్రి పదవి కోరుకుంటారని, అందరికీ మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. సామాజిక సమీకరణలు, ప్రాంతాలు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం ఉంటుందన్నారు.
