చైనా మాస్టర్స్ సూపర్–750 టోర్నీ: సెమీస్లో సాత్విక్‌‌–చిరాగ్‌‌

చైనా మాస్టర్స్ సూపర్–750 టోర్నీ: సెమీస్లో సాత్విక్‌‌–చిరాగ్‌‌

షెంజెన్‌‌: ఇండియా డబుల్స్‌‌ షట్లర్లు సాత్విక్‌‌ సాయిరాజ్‌‌–చిరాగ్‌‌ షెట్టి జోడీ.. చైనా మాస్టర్స్‌‌ సూపర్‌‌–750 టోర్నీలో సెమీస్‌‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మెన్స్‌‌ డబుల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో నాలుగోసీడ్‌‌ సాత్విక్‌‌–చిరాగ్‌‌ 21–13, 16–21, 21–18తో కిమ్‌‌ అస్ట్రుప్‌‌–అండెర్స్‌‌ రాస్‌‌ముసెన్‌‌ (డెన్మార్క్‌‌)పై పోరాడి గెలిచారు. గంటా 10 నిమిషాల మ్యాచ్‌‌లో సాత్విక్‌‌ జంటకు మెరుగైన ఆరంభం దక్కింది.

బలమైన స్మాష్‌‌లు, క్రాస్‌‌ కోర్టు ర్యాలీలతో తొలి గేమ్‌‌ను దీటుగా మొదలుపెట్టారు. ఫలితంగా ప్రత్యర్థులకు ఎక్కడా స్కోరును సమం చేసే చాన్స్‌‌ ఇవ్వకుండా గేమ్‌‌ను ముగించారు. రెండో గేమ్‌‌లో పుంజుకున్న డెన్మార్క్‌‌ జోడీ నెట్ వద్ద మెరుగ్గా ఆడింది. దాంతో స్కోరు 15–15 వరకు హోరాహోరీగా సాగింది. ఈ దశలో మూడు పాయింట్లు నెగ్గిన కిమ్‌‌–అండెర్స్‌‌ 18–15తో వెనుదిరిగి చూసుకోలేదు.

డిసైడర్‌‌లోనూ ఎక్కువ శాతం ఆధిపత్యం చూపెట్టిన కిమ్‌‌–అండెర్స్‌‌ చివర్లో తడబడ్డారు. 15–17తో వెనకబడ్డ సాత్విక్‌‌–చిరాగ్‌‌ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 19–17 ఆధిక్యంలోకి వచ్చింది. డెన్మార్క్‌‌ ద్వయం ఒక్క పాయింట్‌‌ గెలవగా, రెండు స్మాష్‌‌లతో  ఇండియా జోడీ చిరస్మరణీయ విజయం సొంతం చేసుకుంది. మెన్స్‌‌ సింగిల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్‌‌ 16–21, 16–21తో లీ చుక్‌‌ యియు (హాంకాంగ్‌‌) చేతిలో కంగుతిన్నాడు.