కోల్‌కతా: వయసు ధ్రువీకరణ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో జరగనున్న అండర్-–19 సిరీస్ కోసం ఇండియా జట్టులోకి ఎంపికైన కొన్ని వారాలకే ఈ చర్య తీసుకోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రోహిత్.. గత జులైలో శ్రీలంకలో జరిగిన అండర్-–19 టెస్ట్‌లో ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు.
లంక టూర్ సందర్భంగా రోహిత్ సమర్పించిన పత్రాలను పరిశీలించిన అధికారులు తప్పుడు సమాచారాన్ని గుర్తించారు. రోహిత్ వద్ద వేర్వేరు సంవత్సరాలతో కూడిన మూడు జనన ధ్రువీకరణ పత్రాలు (2007, 2009, 2010) ఉన్నట్లు తేలింది. రికార్డుల్లో తేడాల కారణంగా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ఇప్పటికే అతన్ని జూనియర్ జట్ల నుంచి పక్కన పెట్టింది.
ఈ అంశంపై బీసీసీఐకి సమాచారం అందించడంతో, డొమెస్టిక్ క్రికెట్‌లోనూ పాల్గొనకుండా రెండేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే 2026–-27, 2027–-28 సీజన్లకు సంబంధించి 62 మంది ఆటగాళ్లను రిజిస్ట్రేషన్ లేదా ట్రాన్స్‌ఫర్‌కు అనర్హులుగా ప్రకటించింది. ఈ జాబితాలో మాజీ అండర్–19 ప్రపంచ కప్ విజేత రవి కుమార్, ఆల్ రౌండర్ విశాల్ భట్టి కూడా ఉన్నారు. రవి కుమార్ రికార్డుల్లో 45 నెలల వయసు వ్యత్యాసం ఉన్నట్లు తేలడంతో సీఏబీ వేటు వేసింది. మిగతా ఆటగాళ్ల రికార్డులను కూడా పరిశీలించి వెబ్‌సైట్‌లో పూర్తి జాబితాను పొందుపరిచారు.
