రైతులకు పరిహారంతోపాటు పునరావాసం కల్పించాల్సిందే..మల్లన్నసాగర్‌‌ భూసేకరణపై హైకోర్టు కీలక తీర్పు

రైతులకు పరిహారంతోపాటు పునరావాసం కల్పించాల్సిందే..మల్లన్నసాగర్‌‌ భూసేకరణపై హైకోర్టు కీలక తీర్పు
  • రైతులు సమ్మతితో భూములు ఇచ్చారనే కారణంతో వాటిని ఆపడానికి వీలులేదని స్పష్టీకరణ

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మల్లన్నసాగర్‌‌ రిజర్వాయర్‌‌ కోసం జీవో 123 కింద పరస్పర అంగీకారంతో భూములు ఇచ్చిన వారికి, పునరావాసం, పునర్నిర్మాణ ప్రయోజనాలను నిరాకరించరాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ వాకిటి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. భూములకు చెల్లించిన పరిహారం, పునరావాస ప్రయోజనాలు వేర్వేరు అంశాలని తేల్చిచెప్పారు. జీవో 123 ద్వారా భూయజమానులతో చర్చలు జరిపి భూములు సేకరించిన అనంతరం, జీవో 214 ద్వారా పునరావాస వ్యయాన్ని భూమికి చెల్లించే మొత్తంలో నుంచి తొలగించారు.

ఈ నేపథ్యంలో భూమి విలువకు చెల్లించిన మొత్తాన్ని, పునరావాస ప్రయోజనాలతో కలిపి చూడరాదని హైకోర్టు పేర్కొంది. 2016లో ఒప్పందాల ద్వారా భూములు ఇచ్చిన సిద్ధిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌‌, తొగుట, రాంపూర్‌‌ ప్రాంతాలకు చెందిన తిగుళ్ల బాలమణి, అసర్ల పోచవ్వ, లింగొల్ల బాలనర్సవ్వ, ఎక్కల బాలవ్వ తమకు పునరావాస ప్రయోజనాలు కల్పించలేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది రవికుమార్‌‌, ప్రభుత్వం అదనపు అడ్వకేట్‌‌ మహ్మద్‌‌ ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ వాదనలు వినిపించారు.

భూములు ఇచ్చే సమయంలో పునరావాస ప్రయోజనాలు విడిగా కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారని పిటిషనర్లు తెలిపారు. జీవో 123 చెల్లుబాటుపై గతంలో వచ్చిన తీర్పును ప్రభుత్వం సవాల్ చేసిందని, ఆ వ్యవహారం పెండింగ్‌‌లో ఉన్నప్పటికీ తమ భూములను రిజిస్ట్రేషన్‌‌ చేయించుకుని స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. మరోవైపు, రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, పూర్తి పరిహారం తీసుకుని అంగీకార పత్రాలు, ఒప్పందాలపై సంతకాలు చేసినందున వారు అదనపు ప్రయోజనాలు కోరలేరని ప్రభుత్వం తరఫు అడ్వకేట్​జనరల్ వాదించారు. అయితే, అంగీకార పత్రాలు ఇచ్చినంత మాత్రాన చట్టబద్ధంగా లభించే హక్కును వదులుకున్నట్లు కాదని తెలిపింది.