భారతీయ వ్యాపార దిగ్గజం దివంగత రతన్ టాటా వీలునామా చుట్టూ తాజాగా భారీ వివాదం నెలకొంది. ఆయనకు చెందిన రూ.10వేల కోట్ల విలువైన ఆస్తుల పంపిణీపై కొత్త సందేహాలు తెరపైకి వచ్చాయి. రతన్ టాటా తన ఆస్తుల్లో కొంత భాగం స్వచ్ఛంద సంస్థలకు కేటాయించడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ ఇచ్చిన తాజా తీర్పు ఈ చర్చకు ప్రధాన కారణమైంది. రతన్ టాటా తండ్రి నవల్ హోర్ముస్జీ టాటా గతంలో చేసిన షేర్ల బదిలీకి సంబంధించిన నిబంధనలను ఈ తీర్పు హైలైట్ చేసింది. నవల్ టాటా నాటి కాలంలో షేర్లు బదిలీ చేసేటప్పుడు కొన్ని కఠినమైన షరతులు విధించినట్లు సమాచారం.
టాటా సన్స్ హోల్డింగ్స్‌లో 0.83 శాతం వాటాను రతన్ టాటా తన వీలునామాలో రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్, రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్‌లకు సమానంగా కేటాయించారు. మార్కెట్ విలువ ప్రకారం ఈ వాటా సుమారు రూ.10వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా. అయితే ఈ షేర్లు కుటుంబ సభ్యుల మధ్యే ఉండాలనే పాత నిబంధనలకు వీలునామాలోని అంశాలు పూర్తి విరుద్ధంగా ఉందనే వాదన వినిపిస్తోంది.
ఛారిటీ కమిషనర్ అమోగ్ కలోటి సెప్టెంబర్ 2న ఇచ్చిన తీర్పులో.. నవల్ టాటా నాటి నిబంధనలకు విరుద్ధంగా షేర్లను ఇతర దాతృత్వ సంస్థలకు బదిలీ చేస్తే ఎన్‌ఆర్‌టీటీ ట్రస్టీలు తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. దీంతో నవల్ టాటా వీలునామా నిబంధనలకు, రతన్ టాటా వీలునామాలోని అంశాలకు మధ్య పొంతన కుదరని పరిస్థితి ఏర్పడింది.
ఈ అంశంపై న్యాయపరమైన పోరాటం కంటే, సంబంధిత వర్గాలు చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా గ్రూప్‌కు చెందిన ఈ భారీ ఆర్థిక చిక్కుముడి ప్రస్తుతం కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీసింది.
