బెంగళూరు నగరంలో ఐటీ ఉద్యోగం, లక్షల రూపాయల జీతం.. ఎంతోమంది యువత కలలు కనే కార్పొరేట్ జీవితం అది. కానీ ఆ హడావుడి జీవితం ఒక యువ ఇంజనీర్‌కు ప్రశాంతతను ఇవ్వలేకపోయింది. బెంగుళూరు ట్రాఫిక్, ఒత్తిడితో కూడిన వాతావరణానికి స్వస్తి చెప్పి.. సొంతూరు మైసూర్‌కు తిరిగి వెళ్లాలని సుప్రీత్ కశ్యప్ నిర్ణయించుకున్నారు. సరిగ్గా ఇక్కడే ఆయన జీవితంలో ఓ సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. సాఫ్ట్‌వేర్ రంగాన్ని పూర్తిగా విడిచిపెట్టి.. టైర్-2 నగరాల్లో ఉపాధి అవకాశాలు సృష్టించాలనే గట్టి సంకల్పంతో అప్పెరల్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు.
యాక్సెంచర్ కంపెనీలో టెక్కీ ఉద్యోగం మానేయాలని తీసుకున్న అదే నిర్ణయం ఆయనను కోట్లాది రూపాయల టర్నోవర్ సాధించే విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలబెట్టింది. బెంగళూరులోని యాక్సెంచర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో సుప్రీత్‌కు ఆశించిన మానసిక ప్రశాంతత దక్కలేదు. మెట్రో నగరాల కంటే ప్రశాంతమైన వాతావరణం, మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్న మైసూర్ నుంచే ఏదైనా సార్థకమైన పని చేయాలని ఆయన బలంగా కోరుకున్నారు. కేవలం వ్యాపారం చేయడం మాత్రమే కాకుండా.. చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉపాధి కోసం పెద్ద నగరాలకు వలస వెళ్లే అవసరాన్ని తగ్గించాలనే ఆలోచనతో స్టార్టప్ కంపెనీ పెట్టాడు.
ఈ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే 'వెల్బీ' అనే అప్పెరల్ బ్రాండ్. 2021లో సుప్రీత్ తన సొంత పొదుపు, కుటుంబ సభ్యుల సహకారంతో కేవలం రూ.10 లక్షల పెట్టుబడితో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత క్రమంగా ఈ పెట్టుబడి రూ.50 లక్షలకు చేరింది. అంతేకాకుండా ఏంజెల్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.3 కోట్ల నిధులను సేకరించడంలో సక్సెస్ అయ్యాడు. ఎన్విరాన్మెంట్-ఫ్రెండ్లీ దుస్తులపై వెల్బీ ప్రత్యేక దృష్టి సారించాడు. ప్రారంభంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న ఈ సంస్థ.. ఆ తర్వాత అనూహ్యమైన వృద్ధిని సాధించింది.
తొలి సంవత్సరంలో కేవలం రూ.11 లక్షల ఆదాయాన్ని ఆర్జించిన ఈ స్టార్టప్.. ఆ తర్వాత అద్భుతమైన ప్రగతిని కనబరిచింది. రెండో ఏడాది రూ.70 లక్షలు, ఆ తర్వాత రూ.2.4 కోట్లు టర్నోవర్ చేసింది. గతేడాది రూ.5.6 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ నెలవారీ ఆదాయం సుమారు రూ. కోటికి చేరుకుందట. అంతేకాకుండా ఈ ఏడాది వార్షిక టర్నోవర్ రూ. 15 నుంచి 16 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కేవలం 15 మంది ఫుల్ టైం ఉద్యోగులు, సుమారు 40 మంది స్థానిక చేతివృత్తుల స్టార్టప్ ముందుకు సాగుతోంది.
ఎలాంటి బిజినెస్ బ్యాగ్రౌండ్ లేకపోయినా.. అనుకోకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన సుప్రీత్ తన ప్రయాణంలో ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నారు. కేవలం ఫొటోషూట్లపై డబ్బు ఖర్చు చేయడం కంటే.. ప్రాడక్ట్-మార్కెట్ ఫిట్‌మెంట్‌పై దృష్టి పెట్టడం ముఖ్యమని గ్రహించారు. అలాగే విడివిడిగా వ్యక్తులను నియమించుకోవడం కంటే మల్టీటాస్కింగ్ చేయగల నిపుణులతో సమర్థవంతమైన చిన్న టీం నడపడం ద్వారా కంపెనీ ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చని తెలుసుకున్నారు. ఫాస్ట్ ఫ్యాషన్‌కు దూరంగా ఉంటూ.. కేవలం కంఫర్ట్, బ్రీతబిలిటీకి ప్రాధాన్యత ఇస్తున్న వెల్బీ బ్రాండ్ ఇప్పుడు మరింత విస్తరణకు సిద్ధమవుతోంది. అమెజాన్ ద్వారా అమెరికా మార్కెట్లోకి ప్రవేశించి.. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు ఈ యువ పారిశ్రామికవేత్త సిద్ధమవుతున్నారు. సొంతూరిలోనే ఉంటూ యువతకు ఉపాధి కల్పిస్తూ సుప్రీత్ కశ్యప్ సాగిస్తున్న ఈ ప్రయాణం నేటి యువతకు నిజంగా ఓ గొప్ప స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి.
