కొమురవెల్లి, వెలుగు : సిద్ధిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని 21వరుసలతో పెద్దపట్నం, ఉట్టికొట్టుట, ఊరేగింపు వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం యాదవ ఒగ్గు పూజారులు సంప్రదాయబద్ధంగా స్వామివారికి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించగా, ఆలయ ప్రాంగణంలోని గంగిరేగు చెట్టు వద్ద శ్రీకృష్ణ, గొల్లభామ వేషధారణలతో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు.
మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో పంచరంగులతో 21 వరుసలతో పెద్దపట్నం రచించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అర్చకులు ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నం వద్దకు చేర్చి జానపద తరహాలో కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కట్టా సుధాకర్ రెడ్డి, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్నీల చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
