Suresh Raina: 2020 ఆగస్టు 15వ తేదీన టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొన్ని నిమిషాల్లోనే, సురేష్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. యూఏఈలో సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న సమయంలో తాను తీసుకున్న ఈ నిర్ణయం చూసి ఇదేం పని చేశావు? (Ye Kya Kiya Tune) అంటూ ధోనీ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడని రైనా తాజాగా ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానల్ లో వెల్లడించాడు. కేవలం 33 ఏళ్ల వయసులోనే జట్టు నుంచి తప్పుకున్నప్పటికీ, తన నిర్ణయంపై ఎలాంటి బాధ లేదా అసంతృప్తి లేదని స్పష్టం చేశాడు.
నా కోసం తన బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేసిన కెప్టెన్:
ధోనీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సురేశ్ రైనా పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నాడు. జట్టు ప్రయోజనాల కోసం, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడానికి మిస్టర్ కూల్ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను త్యాగం చేశాడని తెలిపాడు. గతంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో పైస్థానంలో బ్యాటింగ్ చేసిన మహీ, ఆ తర్వాత యువరాజ్ సింగ్, రైనాలను ముందుకు పంపి తాను మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్‌కు దిగేవాడని గుర్తు చేశాడు. మన నైపుణ్యంపై తనకంటే ఎక్కువగా నమ్మకం ఉంచిన కెప్టెన్ కోసం మైదానంలో ప్రాణం పెట్టి ఆడామని భావోద్వేగానికి గురయ్యాడు.
కష్టసమయంలో తోడుగా.. అన్నయ్యలాంటి వాడు:
2011 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ 0–4 తో టెస్టు సిరీస్ ఓడిపోయినప్పుడు ధోనీ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని రైనా గుర్తుచేశాడు. ఆ కష్టసమయంలో ధోనీకి తమ్ముడిలా తోడుగా నిలిచి, ఆ తర్వాతి వన్డే సిరీస్‌లో జట్టును మళ్లీ విజయతీరాలకు చేర్చామని పేర్కొన్నాడు. ఏడాదిలో దాదాపు 250 రోజులు ఇద్దరం కలిసి గడిపేవారమని, ధోనీ తనకు ఒక సొంత అన్నయ్యలాంటి వాడని కొనియాడాడు. క్రికెట్ ద్వారా తమ మధ్య ఏర్పడిన ఈ స్నేహబంధం జీవితాంతం ఇలాగే ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఆర్మీ కుటుంబం నుంచి దిగ్గజం వరకు.. ఎలాంటి బాధా లేదు:
తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. ఒక సాధారణ సైనిక కుటుంబం నుంచి వచ్చి ఐదుగురు అన్నదమ్ములు, ఒక సోదరితో కలిసి ఒకే ఇంట్లో పెరిగానని సురేశ్ రైనా చెప్పాడు. ఒకప్పుడు సాధారణ వసతులతో గడిపిన తాము, ఇప్పుడు అత్యుత్తమ హోటళ్లలో బస చేసే స్థాయికి ఎదిగామని గుర్తు చేసుకున్నాడు. క్రికెట్ తనకు ప్రతిదీ ఇచ్చిందని, ఐపీఎల్‌లో ఎన్నో ట్రోఫీలు గెలిచి అద్భుతమైన కెరీర్‌ను ఆస్వాదించానని పేర్కొన్నాడు. అందుకే ఆట నుంచి త్వరగా తప్పుకున్నా ఎలాంటి విచారం లేదని, మనశ్శాంతితో జీవిస్తున్నానని రైనా భాయ్ పేర్కొన్నాడు.
