IPLలో ఈ రూల్ వల్లే బౌలర్లు బలైపోతున్నారు.. మాజీ CSK ఆటగాడు సంచలన వ్యాఖ్యలు!

IPLలో ఈ రూల్ వల్లే బౌలర్లు బలైపోతున్నారు.. మాజీ CSK ఆటగాడు సంచలన వ్యాఖ్యలు!

Impact Player Rule IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో 2023లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు అంతర్జాతీయ క్రీడాకారులు దీనిని తప్పుబట్టగా, తాజాగా మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా కూడా ఈ నియమంపై తీవ్రంగా మండిపడ్డాడు. ఆకాశ్ చోప్రా యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రైనా మాట్లాడుతూ.. ఈ నిబంధన వల్ల ఐపీఎల్‌లో ఆటగాళ్లు తమ నైపుణ్యాలను పూర్తిస్థాయిలో మెరుగుపరుచుకునే అవకాశమే లేకుండా పోతోందన్నాడు. ఫిట్‌గా ఉండే ఆటగాళ్లు కూడా కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుంటున్నారని, దీనివల్ల ఆల్‌రౌండర్లుగా ఎదగడం కష్టమైతుందన్నారు.  

300 పరుగులు కొడుతుంటే బౌలర్లు ఏం చేస్తారు:  

గతంతో పోలిస్తే ప్రస్తుతం ఐపీఎల్‌లో పరుగుల వరద పారుతోందని, ఈ రూల్ వల్ల బ్యాటర్లు భయం లేకుండా రిస్క్ తీసుకుంటున్నారని సురేశ్ రైనా గుర్తుచేశాడు. గతంలో 170 పరుగులు చేస్తే పోటీ వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు 250+ రన్స్ చేసినా ఈజీగా ఛేజ్ చేస్తున్నారు, ఏకంగా 300 పరుగులు బోర్డుపైకి వస్తున్నాయి. వినోదం ఒకే, కానీ బౌలర్లకు కూడా ఏదో ఒకటి మిగల్చాలి కదా.. ప్రపంచకప్‌లో ఇలాంటి వింత నియమాలు ఉండవు.. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల జట్టులో అదనపు బ్యాటర్ ఉండటంతో బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని రైనా ఆవేదన వ్యక్తం చేశాడు.

విదేశీ లీగ్‌లలో భారత ఆటగాళ్లు ఆడాలా?: 

విదేశీ టీ20 లీగ్‌లైన బిగ్ బాష్ లీగ్ (BBL), ది హండ్రెడ్ లాంటి టోర్నీలలో భారత క్రికెటర్లను ఆడేందుకు అనుమతించాలనే ప్రతిపాదనను కూడా మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రస్తుతం భారత ఆటగాళ్లకు అలాంటి అవసరం లేదని తేల్చిచెప్పాడు. మన ఐపీఎల్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత పటిష్టంగా మారింది. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లినప్పుడు విదేశీ లీగ్స్ ఆడేందుకు నేను కూడా ప్రయత్నించాను కానీ అనుమతి దక్కలేదు. కానీ ఇప్పుడు మన లీగ్ స్థాయి ఎంతగానో పెరిగినందున, ఇండియన్ ప్లేయర్స్ ఇతర విదేశీ లీగ్‌లకు వెళ్లాల్సిన పనిలేదని రైనా తేల్చి చెప్పాడు. 

బౌలింగ్ నాణ్యత తగ్గిపోతుంది: 

ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లకు సిద్ధమయ్యే క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ భారత క్రికెట్‌కు దీర్ఘకాలంలో నష్టం చేకూరుస్తుందని సురేశ్ రైనా హెచ్చరించాడు. ఆల్ రౌండర్ల పాత్ర తగ్గిపోవడం, బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ దెబ్బతినడం ఆందోళనకరమని అన్నాడు. ఐపీఎల్ ద్వారా కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తున్నప్పటికీ, క్రికెట్ సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని క్రీడా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.