- సూపర్ ఫామ్లో స్మృతి మంధాన
- రా. 8 నుంచి సోనీ స్పోర్ట్స్లో లైవ్
దుబాయ్: విమెన్స్ టీ20 ఆసియా కప్‌లో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న ఇండియా.. మరో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. గ్రూప్–ఎలో భాగంగా శనివారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. తర్వాతి రౌండ్లలో బలమైన ప్రత్యర్థులు ఎదురుకానున్న నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చూపెట్టాలని హర్మన్‌సేన భావిస్తోంది.
ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా రెండు విజయాలు సాధించి జోరుమీదున్న ఇండియా ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పుడున్న గణాంకాలు, ఫామ్ ప్రకారం చూస్తే ఆసియా స్థాయిలో టీమిండియాను ఎదుర్కొనే స్థాయి ప్రస్తుతానికి ఏ జట్టుకూ లేదు. కాబట్టి గత టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఇండియా.. ఈసారి ఎలాగైనా ట్రోఫీని కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా హాంకాంగ్‌తో మ్యాచ్‌లో రికార్డు సెంచరీ చేసిన మంధాన.. ప్రత్యర్థులకు స్పష్టమైన హెచ్చరికలు పంపింది.
అయితే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న ప్రతీకా రావల్ టీ20 ఫార్మాట్‌కు తగ్గట్లుగా రాణించడం లేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్ కూడా క్రీజులో కుదురుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వన్డేల్లో ఈ ఇద్దరు మెరుగ్గా ఆడినా షార్ట్ ఫార్మాట్‌లో జట్టు అవసరాలను తీర్చలేకపోతున్నారు. నందని శర్మ రాకతో పేస్ బౌలింగ్ మరింత బలోపేతంగా మారింది. క్రాంతి గౌడ్‌తో కలిసి ఆమె ఆరంభంలోనే వికెట్లు తీయడం ఇండియాకు సానుకూలాంశం. ముగ్గురు స్పిన్నర్లు ఇండియా బౌలింగ్‌కు ప్రధాన అస్త్రాలుగా మారారు.
బలహీనంగా పాకిస్తాన్..
మరోవైపు పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్‌లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. థాయ్‌లాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. దాంతో 119 రన్స్ లక్ష్యాన్ని అతి కష్టమ్మీద కాపాడుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాకు పోటీ ఇచ్చే బ్యాటింగ్ లైనప్ పాక్ వద్ద లేదనే చెప్పాలి. ఓపెనర్ మునీబా అలీ, కెప్టెన్ ఫాతిమా సనాలపైనే జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. ఇండియాలాంటి బలమైన ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవాలంటే బ్యాటింగ్, బౌలింగ్‌లో కీలకమైన మార్పులు చేయాల్సి ఉంది. మరి ఆ దిశగా పాక్ అడుగులు వేస్తుందా? లేదా? చూడాలి.
