- నాలుగు రోజులైనా దర్యాప్తులో కనిపించని పురోగతి
- ఆర్మీ మద్రాస్ రెజిమెంట్‌లో 63 మందిని ప్రశ్నించిన పోలీసులు
- జాడ లేని ఆయుధాలు.. చిక్కని చోరీ ఆధారాలు
- వంద మందితో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల మిస్సింగ్ మిస్టరీగా మారింది. దేశ రక్షణ వ్యవస్థలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదు. స్థానిక పోలీసులు, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సహా సుమారు 100 మందితో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ ఆయుధాల జాడ మాత్రం లభించలేదు. దీంతో మేడ్చల్–మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు కేసును సవాల్‌గా తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రెజిమెంట్ సిబ్బందిని విచారించడంతో పాటు చోరీ కేసులను ఛేదించడంలో నైపుణ్యం ఉన్న అధికారులతో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.
దొరకని క్లూ..
ఆర్మీ మద్రాస్ రెజిమెంట్ ఆర్మరీ నుంచి ఆదివారం రాత్రి నాలుగు ఏకే-203 రైఫిళ్లు, ఒక ఇన్సాస్ వెపన్, పలు రైఫిళ్లు, బుల్లెట్లు, మందుగుండు సామగ్రి మిస్సైన విషయం తెలిసిందే. ఈ అంశం దేశ భద్రతకు సంబంధించినది కావడంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఆర్మరీలో గార్డ్ డ్యూటీ చేసే సిబ్బందితో పాటు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ల వరకు దాదాపు 63 మందిని విచారించినట్టు తెలిసింది. అయినా, ఆయుధాలు ఎలా మాయమయ్యాయనే దానిపై కీలక సమాచారం రాబట్టలేకపోయినట్టు సమాచారం. రెజిమెంట్ నుంచి ఆయుధాలు బయటకు వెళ్లినట్టు కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది.
సిబ్బందిపైనే అనుమానాలు?
రెజిమెంట్ లోపల, బయట అనుమానితుల కదలికలకు సంబంధించిన ఆధారాలు లభించకపోవడంతో కేసు దర్యాప్తు సంక్లిష్టంగా మారింది. దీంతో రెజిమెంట్ సిబ్బందినే పోలీసులు అనుమానిస్తున్నట్టు సమాచారం. ఆర్మరీ సమీపంలోని కొన్ని సీసీటీవీ కెమెరాలు స్విచ్ ఆఫ్‌లో ఉండటం, కొంతమంది సిబ్బంది పోలీసుల విచారణకు పూర్తిస్థాయిలో సహకరించకపోవడం అనుమానాలకు తావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే దర్యాప్తు ముందుకు సాగడం లేదనే టాక్నడుస్తోంది.
ఆయుధాల చోరీ అసాధ్యం
అత్యంత పటిష్టమైన భద్రత ఉండే ఆర్మీ క్యాంపులో ఆయుధాలను ఎత్తుకెళ్లడం అంత ఈజీ కాదని సీనియర్ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఆర్మీ ఇంటెలిజెన్స్‌తో పాటు రెజిమెంట్ ఉన్నతాధికారులు అంతర్గతంగా విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.
ఆ విచారణలోనూ ఆయుధాల జాడ లభించకపోవడంతోనే రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అంతర్గత విచారణలో ఆయుధాలు గుర్తిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, కేసు దర్యాప్తుపై రాష్ట్ర ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు.
