వెలుగు ఓపెన్ పేజీ : మట్టి గణపతిని పూజించడం.. ప్రకృతిని రక్షించడమే 

వెలుగు ఓపెన్ పేజీ :  మట్టి గణపతిని పూజించడం.. ప్రకృతిని రక్షించడమే 

వినాయక చవితి  వస్తుందంటే  ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో పండుగ సందడి కనిపిస్తుంది.  చిన్నారుల నుంచి పెద్దల వరకు గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించేందుకు సిద్ధమవుతారు.  వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించి,  పూజలు చేసి,  నైవేద్యాలు సమర్పించి, చివరకు నిమజ్జనం చేయడం మన సంప్రదాయం. అయితే కాలానుగుణంగా ఈ పండుగలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా గణపతి విగ్రహాల తయారీలో మట్టి స్థానంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్,  రసాయన రంగులు, ఇతర కృత్రిమ పదార్థాల వినియోగం పెరిగింది.  భక్తి పేరుతో ప్రకృతికి నష్టం కలిగించడం సంప్రదాయం కాదు. అందుకే  మనం వినాయక చవితికి  మట్టి గణపతిని పూజిద్దాం... ప్రకృతిని రక్షిద్దాం అనే ఆలోచనను  ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.  మట్టి అంటే కేవలం ఒక పదార్థం కాదు.  మనిషి జీవనానికి ఆధారం.  తినే ఆహారం పండేది మట్టిలోనే.  చెట్లు, మొక్కలు పెరిగేది మట్టిలోనే.  ప్రకృతిలోని అనేక  జీవరాశులకు మట్టి ఒక సహజ నివాసం. 

మట్టితో మనిషికి అనుబంధం

 మట్టితో  తయారు చేసిన గణపతి విగ్రహం ప్రకృతితోపాటు మట్టితో  మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది.  మట్టి గణపతి తయారీలో సాధారణంగా సహజమైన మట్టిని ఉపయోగిస్తారు.  వీటిన సహజ రంగులతో అలంకరిస్తే ఈ విగ్రహాలు పర్యావరణానికి తక్కువ హాని కలిగిస్తాయి. పూజ అనంతరం నీటిలో నిమజ్జనం చేసినప్పుడు మట్టి క్రమంగా కరిగి ప్రకృతిలో కలిసిపోతుంది. సంప్రదాయానికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఒక అందమైన సమన్వయం. వినాయక నిమజ్జనం సంస్కృతిలో ఒక ముఖ్యమైన ఘట్టం.  వచ్చినది ప్రకృతిలోంచే... తిరిగి ప్రకృతిలోకే అనే భావన ఇందులో దాగి ఉంది.  మట్టితో  తయారైన గణపతి విగ్రహం నిమజ్జనం తర్వాత నీటిలో కరిగిపోతుంది.  మట్టిలోని సహజ పదార్థాలు తిరిగి ప్రకృతిలో కలిసే అవకాశం ఉంటుంది. అందువల్ల పర్యావరణంపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.

పర్యావరణానికి హానికరం

విగ్రహాలకు ఉపయోగించే  రసాయనాల రంగులు పర్యావరణానికి హానికరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా లోహ ఆధారిత లేదా ఇతర హానికరమైన రసాయనాలు కలిగిన రంగులు నీటిలో కలిసినప్పుడు నీటి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ నీటిని ఆధారంగా చేసుకున్న చేపలు, ఇతర జలచరాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఒక చిన్న విగ్రహం వల్ల పెద్ద నష్టం జరగకపోవచ్చని అనిపించవచ్చు. కానీ ఒక నగరంలో వేలాది విగ్రహాలు, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది విగ్రహాలు నిమజ్జనం చేస్తే ప్రభావం ఎంత పెద్దదిగా ఉంటుందో  ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చెరువులు, సరస్సులు, నదులు కేవలం ప్రజల అవసరాలకు మాత్రమే కాదు. అనేక జీవరాశులకు అవి జీవనాధారం.  నిమజ్జనం సమయంలో నీటిలో చేరే కృత్రిమ పదార్థాలు, రంగులు, అలంకరణ సామగ్రి, ప్లాస్టిక్ తదితర వ్యర్థాలు జలచరాల జీవనానికి సమస్యగా మారవచ్చు. 

మట్టి గణపతిని పూజిద్దాం,  ప్రకృతిని కాపాడుదాం

 గణపతి మండపాల అలంకరణలో ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ షీట్లు, థర్మాకోల్, ప్లాస్టిక్ బ్యానర్లు, ఇతర కృత్రిమ వస్తువుల వినియోగం కూడా కనిపిస్తుంది. పండుగ ముగిసిన తర్వాత ఈ పదార్థాలు వ్యర్ధాలుగా మారుతాయి. వీటిలో చాలా పదార్థాలు సులభంగా కుళ్లిపోవు. చెత్త కుప్పల్లో చేరడం, కాల్చడం లేదా నీటి వనరుల్లో పడేయడం వల్ల పర్యావరణానికి అదనపు సమస్యలు ఏర్పడవచ్చు. అందుకే విగ్రహంతోపాటు పూజా సామగ్రి, అలంకరణ విషయంలో కూడా సహజ పదార్థాలను ఎంచుకోవాలి.  మట్టి గణపతిని ఇంటికి తీసుకురావడం అంటే కేవలం ఒక విగ్రహాన్ని కొనుగోలు చేయడం కాదు. అది ప్రకృతిని గౌరవిస్తున్నామనే సందేశం. పండుగలు కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు. సంస్కృతీ సంప్రదాయాలు, సామాజిక బాధ్యతలను తరువాతి తరాలకు అందించడానికి కూడా అవి ఒక మంచి అవకాశం. మట్టి గణపతిని పూజిద్దాం,  ప్రకృతిని కాపాడుదాం,  భావితరాలకు స్వచ్ఛమైన భూమిని అందిద్దాం.
 

- డాక్టర్ 
వై. సంజీవ కుమార్
ఫౌండర్ & ప్రెసిడెంట్, 
స్కై ఫౌండేషన్