- రాజకీయ పదవులు, విద్య, ఉద్యోగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి
- కాంగ్రెస్ బీసీలను రాజకీయంగా అణగదొక్కుతోంది: రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
బషీర్‌బాగ్, వెలుగు: బీసీల జనాభా దామాషా ప్రకారం రాజకీయ పదవులు, విద్య, ఉద్యోగాలు, పరిశ్రమలు సహా అన్ని రంగాల్లో తగిన వాటా కల్పించాలని బీసీ మేధావుల ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను రాజకీయంగా అణగదొక్కుతోందని ఆరోపించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చిరంజీవులు మాట్లాడారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి బీసీ నేతలకు కాంగ్రెస్‌లో తగిన ప్రాధాన్యం దక్కలేదన్నారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, కాంగ్రెస్ ఆమెను బలిపశువును చేసిందని ఆరోపించారు. ఖాళీ అయిన మంత్రి పదవిని కూడా అగ్రవర్ణాలకే ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గతంలో తీన్మార్ మల్లన్న, పొన్నాల లక్ష్మయ్య వంటి బీసీ నేతల విషయంలోనూ కాంగ్రెస్ చర్యలు తీసుకుందని గుర్తుచేశారు.
బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యంతో పాటు కీలక పదవుల్లో అవకాశాలు కల్పించాలని కోరారు. దేశంలో సంపూర్ణ సామాజిక న్యాయం సాధించే వరకు బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీసీ సమాజం ఆత్మపరిశీలన చేసుకుని రాజ్యాధికార సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు నారగొని, పురుషోత్తం, నర్సింగ్‌రావు, నందగోపాల్, సతీష్, ఉదయ్ నేత, సత్యరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
