హైదరాబాద్ సిటీ నెట్వర్క్, వెలుగు: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం అన్ని ఇస్కాన్ టెంపుల్స్, శ్రీ కృష్ణ మందిరాల్లో వైభవంగా జరిగాయి. బంజారా హిల్స్‌లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, నార్సింగి (కోకాపేట్) లోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్‌లో శ్రీ రాధా గోవింద, లడ్డు గోపాల్, శ్రీ మాఖన్ కృష్ణుల రూపాల్లో దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తులు ఉయ్యాల సేవలో పాల్గొన్నారు. 56 రకాల వంటకాలతో ఛప్పన్ భోగ్ సమర్పించారు. రాజభోగ హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌర చంద్ర దాస ప్రభూజీ పాల్గొన్నారు.
కూకట్పల్లి ఇస్కాన్ టెంపుల్లో ఇస్కాన్ డైరెక్టర్మహా శృంగదాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్లో స్వామివారి మూలవిరాట్‌ను సుందరంగా అలంకరించారు. బహదూర్ పురాలోని మిశ్రీ గంజ్ లో ఉన్న 2 వేల ఏండ్ల పైబడిన ప్రాచీన గోపాల కృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిల్పరామంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
అబిడ్స్ లో ఆధ్యాత్మిక శోభ
అబిడ్స్ ఇస్కాన్ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఇస్కాన్ అధ్యక్షుడు వరద కృష్ణదాసు, కార్యదర్శి శంభో వైష్ణవ దాస్ ఆధ్వర్యంలో ఆలయంతోపాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.- 108 మృదంగాలతో ప్రత్యేక కీర్తన ఎగ్జిబిషన్ మైదానంలో భజనలు, కీర్తనలు, నృత్య, నాటక ప్రదర్శనలు, కృష్ణకథ, కృష్ణమేళా, ఆనంద్ బజార్ తదితర ప్రోగ్రామ్స్నిర్వహించారు.
