- మూడు ప్రాంతాల అభివృద్ధికి రూ.299 కోట్లతో కేంద్రానికి ప్రపోజల్స్
- రోప్‌వే, లేజర్‌షోలు, వర్చువల్ మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు సన్నాహాలు
- కేంద్రం ఆమోదిస్తే రాష్ట్రానికి పెరగనున్న ఆదాయం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ప్రాచీన చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని నలుదిశలా చాటేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వదేశీ దర్శన్ 2.0’ స్కీమ్‌లో భాగంగా రాష్ట్రంలోని మూడు ప్రధాన ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.299 కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు సమర్పించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక, చారిత్రక మెదక్ ఫోర్ట్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులను ఈ పథకం కింద ఎంపిక చేసింది.
ప్రాచీన వైభవానికి ఆధునిక హంగులు
వేల ఏండ్ల నాటి జైన, శైవ సంస్కృతుల నిలయమైన కొలనుపాక క్షేత్రానికి పూర్వవైభవం తెచ్చేలా రూ.103 కోట్లతో అభివృద్ధి పనులు ప్రతిపాదించారు. ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ, కల్చరల్ ప్లాజా, యాత్రికుల విశ్రాంతి భవనాలు, నూతన అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇక్కడి విశిష్ట చరిత్రను భావితరాలకు వివరించేందుకు వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతలతో కూడిన అధునాతన ‘డిజిటల్ మ్యూజియం’ ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు చెరువులో బోటింగ్, ఆకట్టుకునేలా సౌండ్ అండ్ లైటింగ్ ప్రదర్శనలను సిద్ధం చేయనున్నారు.
కాకతీయుల చరిత్రకు పునరుజ్జీవం
కాకతీయులు, కుతుబ్‌షాహీల కాలం నాటి రక్షణ వ్యవస్థకు ప్రతీకగా నిలిచిన మెదక్ కోట పునరుద్ధరణకు అత్యధికంగా రూ.110 కోట్లు కేటాయించాలని కోరారు. శిథిలావస్థకు చేరిన కోట బురుజులు, గోడల పటిష్ఠత (రిస్టోరేషన్), పరిసరాల్లోని ఐలాండ్ అభివృద్ధి, పర్యాటకుల బస కోసం ఆహ్లాదకరమైన రిసార్టులు, బాంక్వెట్ హాల్స్ నిర్మించాలని ప్రపోజల్స్ పంపించారు. కొండపైకి చేరుకునేందుకు రోప్‌వే సౌకర్యం, సహజ సిద్ధమైన వ్యూ పాయింట్లు, సాహస పర్యాటకుల కోసం వాటర్ స్పోర్ట్స్ అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించారు. రాత్రి వేళల్లో కోట చరిత్రను కళ్లకు కట్టేలా లేజర్, సౌండ్ అండ్ లైట్ షోలు నిర్వహించనున్నారు.
నదీతీర పర్యాటకం.. ఆధ్యాత్మిక వైభవం
గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరం ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పర్యాటక కేంద్రంగా మలచడానికి రూ.86 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. గోదావరి తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు గుండాల చెరువు అభివృద్ధి, ప్రకృతి ఒడిలో ‘ముక్తివనం’, పర్యాటకుల వసతి కోసం గదులను నిర్మించనున్నారు. నదీ జలాల్లో వేగంగా ప్రయాణించే స్పీడ్ బోట్లు, ఆధునిక క్రూయిజ్‌లు, వాటర్ స్పోర్ట్స్‌తో పాటు సదస్సుల నిర్వహణకు అనువుగా కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
సర్కార్ కు పెరగనున్న ఆదాయం
రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు కేంద్ర పర్యాటకశాఖ ఆమోదముద్ర వేస్తే ఈ మూడు ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరగడం ద్వారా ప్రవేశ రుసుములు, వసతి గృహాలు, పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అలాగే టూరిస్ట్ గైడ్లు, రవాణా రంగం, స్థానిక చేతివృత్తులు, హోటల్స్, రిసార్టుల నిర్వహణ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
