ధాన్యం కొట్టేసి.. మిల్లు ఎత్తేసి! కరీంనగర్ లో రూ.12 కోట్ల విలువైన సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పక్కదారి

ధాన్యం కొట్టేసి.. మిల్లు ఎత్తేసి! కరీంనగర్ లో రూ.12 కోట్ల విలువైన సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పక్కదారి
  • మిషనరీ సహా ధాన్యం మొత్తం మాయం 
  • ఆ స్థానంలో టైర్ల గోదాం ఏర్పాటు
  • తాజాగా విజిలెన్స్ తనిఖీల్లో వెలుగులోకి
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదిత్య ఇండస్ట్రీస్ యజమాని నిర్వాకం
  • గతంలో జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో 
  • ఇదే తరహాలో రూ.130 కోట్ల ధాన్యం హాంఫట్​
  • ష్యూరిటీలు, రికవరీ విషయంలో అధికారులు సైలెంట్

కరీంనగర్, వెలుగు:  కస్టమ్‌‌‌‌‌‌‌‌ మిల్లింగ్​ రైస్​ (సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఎగ్గొట్టిన వ్యవహారంలో మరో కొత్త మోసం బయటపడింది. ఓ వ్యాపారికి సొంత రైస్ మిల్లు లేకపోయినా.. వేరొకరి మిల్లును లీజుకు తీసుకుని చూపితే ఆఫీసర్లు కోట్లాది విలువైన ధాన్యం కేటాయించారు. ఆ బియ్యం ఇవ్వకపోయినా మళ్లీ టెండర్ ధాన్యం కూడా కేటాయించారు. ఇచ్చిన ధాన్యం ఇచ్చినట్లే దారిమళ్లింది. ఒక్క బియ్యం గింజ కూడా సర్కారుకు తిరిగి రాలేదు. ఇటీవల విజిలెన్స్ ఆఫీసర్లు వెళ్లి చూస్తే.. అక్కడ ధాన్యం కాదు కదా.. అసలు మిల్లే లేదు. మిల్లు స్థానంలో టైర్ల గోదాం దర్శనమిచ్చింది. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఆదిత్య ఇండస్ట్రీస్​లో సుమారు రూ.12 కోట్ల విలువైన ధాన్యం దారి మళ్లింపు వ్యవహారం ఇప్పుడు సివిల్ సప్లయిస్​ శాఖలో హాట్ టాపిక్‌‌‌‌‌‌‌‌గా మారింది. విజిలెన్స్  రిపోర్టు మేరకు అధికారులు సదరు వ్యాపారిపై 
క్రిమినల్ కేసు నమోదు చేయనున్నారు.  

ధాన్యం కేటాయించారిలా.. 

ఆదిత్య ఇండస్ట్రీస్ యజమాని విజయపాల్ రెడ్డి  సొంతంగా మిల్లు లేకపోయినా కరీంనగర్ రూరల్ మండలం గోపాల్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ రైస్ మిల్లును లీజుకు తీసుకున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో 2022–23 రబీ సీజన్‌‌లో 6,221 మెట్రిక్ టన్నుల టెండర్ ధాన్యం ఈ మిల్లుకు కేటాయించారు. ఇందులో 3,152 మెట్రిక్ టన్నుల ధాన్యం డబ్బులు చెల్లించిన సదరు యజమాని.. మరో 3,068 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి  సుమారు రూ.6.50 కోట్లు చెల్లించలేదు. అదే ఏడాది రబీ సీజన్‌‌కు సంబంధించి మరో 5.80 కోట్ల విలువైన 2,769 మెట్రిక్ టన్నుల  సీఎంఆర్ పెండింగ్‌‌లో ఉంది. మొత్తంగా రూ.12 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి.

కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న మిల్లులో ఈ స్థాయిలో బకాయిలు ఉన్నా సివిల్ సప్లై ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్‌‌ఫోర్స్ మెంట్ అధికారులు ఈ మిల్లులో తనిఖీలు చేయగా.. అక్కడ మిల్లు లేదు. ధాన్యం గింజ లేదు. అసలు రైస్ మిల్లు ఆనవాళ్లే లేవు. మిల్లు స్థానంలో టైర్ల గోదాం కనిపించడంతో ఆఫీసర్లు షాక్ అయ్యారు. ఈ దందాలో విజయపాల్ రెడ్డి ఒక పావు మాత్రమేనని, అతడి దందా వెనక పెద్దపల్లి జిల్లాకు చెందిన మరో బడా మిల్లర్ ఉన్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ష్యూరిటీలు తీసుకునే ధాన్యం ఇచ్చారా ? 

జిల్లాలో లీజు మిల్లులతో ఆదిత్య ఇండస్ట్రీస్​లో రూ.12 కోట్ల విలువైన ధాన్యం దారిమళ్లిన తరహాలోనే జమ్మికుంట మండలం మహాశక్తి అగ్రో ఇండస్ట్రీస్, ఇల్లందకుంట మండలంలో శ్రీసీతారామ అగ్రో ఇండస్ట్రీస్ లో రూ.130 కోట్ల విలువైన ధాన్యం పక్కదారిపట్టింది. బండారి మారుతి దంపతులు కూడా ఇతర మిల్లులను లీజుకు తీసుకునే దందాకు పాల్పడ్డారు. నిబంధనల ప్రకారం.. మిల్లు లీజుకు తీసుకున్న వ్యాపా రులకు రూ. కోట్ల విలువైన ధాన్యం కేటాయించిన సందర్భంలో సదరు వ్యాపారి తరఫున మిల్లు యజమానితోపాటు మరో ఇద్దరు ష్యూరిటీ సంతకాలు చేయాల్సి ఉంటుంది. జిల్లాలోని ఈ మూడు మిల్లుల విషయంలో అసలు ష్యూరిటీలు తీసుకున్నారో లేదోనన్న సందేహాలు ఉన్నాయి. లీజుదారులు డబ్బులు చెల్లించకుంటే ష్యూరిటీగా ఉన్నవాళ్ల ఆస్తులు జప్తు చేయాల్సి ఉంటుంది. అధికారులు మాత్రం ష్యూరిటీల విషయంలో మౌనంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.