- అలాంటి పోస్టులతో తనకు సంబంధం లేదన్న మాజీ మంత్రి
హైదరాబాద్, వెలుగు: కొండా సురేఖ పేరుతో ఉన్న ఫేస్‌బుక్ పేజీలో శుక్రవారం ఉదయం ప్రత్యక్షమైన ఓ పోస్టు రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ‘ఏ బిగ్ అప్డేట్ ఈజ్ కమింగ్ సూన్’ అంటూ పోస్టు రావడంతో మీడియా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయ్యారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని సురేఖ ఇప్పటికే స్పష్టం చేశారు.
అయినా సీఎంకు వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో ‘కొండా దారెటు?’ అనే చర్చ జరుగుతోంది. సురేఖ బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని కొందరు, బీజేపీలో చేరుతారని మరికొందరు.. వైఎస్సార్‌సీపీ లేదా జనసేనలోకి వెళ్తారని ఇంకొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడ్తున్నారు. ఈ క్రమంలో ఆమె పేరుతో ఉన్న ఫేస్‌బుక్ పేజీలో వచ్చిన తాజా పోస్టుతో మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. సురేఖ రాజీనామా చేస్తారని, మరో పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే కొద్దిసేపటికే కొండా సురేఖ ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
సోషల్ మీడియాలో పలు వేదికల్లో తన పేరుతో ఫేక్ పోస్టులు పెడ్తున్నారని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన అధికారిక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో వచ్చే పోస్టులను మాత్రమే నమ్మాలని సూచించారు. ఇతర అకౌంట్ల నుంచి తన పేరుతో వచ్చే పోస్టులను నమ్మొద్దని కోరారు.
