భారతీయ సమాజంలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. జ్ఞానాన్ని అందించే వ్యక్తిగా మాత్రమే కాకుండా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మార్గదర్శిగా గురువును గౌరవించడం మన సంప్రదాయం. ఈ సత్యాన్నే తన జీవితంతో చాటిచెప్పిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన జయంతి అయిన సెప్టెంబర్ 5ను దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఉపాధ్యాయ వృత్తికి భారతదేశం ఇచ్చే గౌరవానికి ప్రతీక. భారత తొలి ఉప రాష్ట్రపతిగా, అనంతరం రాష్ట్రపతిగా సేవలందించిన రాధాకృష్ణన్ జీవిత ప్రస్థానం ఉపాధ్యాయ వృత్తి గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన తన జన్మదినాన్ని వ్యక్తిగత వేడుకగా కాకుండా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని కోరుకోవడం ద్వారా గురువుకు సమాజంలో ఉన్నత స్థానం కల్పించాలనే సందేశాన్ని ఇచ్చారు. మంచి ఉపాధ్యాయులు మంచి సమాజాన్ని కూడా నిర్మించగలరు. గురువు చెప్పే మాటలకంటే గురువు ఆచరించే జీవన విధానమే విద్యార్థులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
డిజిటల్ యుగంలో విద్యారంగం కొత్త రూపం
ఆన్‌లైన్ కోర్సులు విద్యార్థులకు జ్ఞాన సముపార్జనకు అనేక మార్గాలను తెరిచాయి. సమాచారం అందుబాటులోకి రావడం వల్ల గురువు అవసరం తగ్గిపోయిందని భావించడం పొరపాటు. సాంకేతికత సమాచారం ఇవ్వగలదు, కానీ ఆ సమాచారాన్ని జ్ఞానంగా, వివేకంగా, వివేకాన్ని విలువలతో కూడిన జీవనంగా మార్చేది గురువే. అందుకే డిజిటల్ యుగంలో గురువుల విలువ మరింత పెరగాలి. నేటి డిజిటల్ ప్రపంచంలో సమాచారం క్షణాల్లో అందుబాటులోకి వస్తోంది. కృత్రిమ మేధ అనేక విషయాలను విశ్లేషించి అందిస్తుంది. యూట్యూబ్‌లో వేలాది పాఠాలు ఉన్నాయి. కానీ ఏది సరైన సమాచారం? ఏది తప్పు? జ్ఞానాన్ని ఎక్కడ, ఎలా ఉపయోగించాలి? మానవీయ విలువలతో ఎలా జీవించాలి? అనే ప్రశ్నలకు సరైన మార్గదర్శకత్వం ఇచ్చేది గురువే.
నైతిక విలువలు పతనం
బోధనా ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు, సామాజిక నైతిక విలువలు పడిపోతున్న ఈ తరుణంలో ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయులకు తమ విధులను, బాధ్యతలను గుర్తుకు తెచ్చి ఆ వృత్తికి న్యాయం చేయటంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. నిత్యం హక్కుల గురించి మాట్లాడేవారు గురువు బోధించిన విలువలను ఆచరించడం, ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో తగిన గౌరవాన్ని కల్పించడం, విద్యను వ్యాపారంగా కాకుండా వ్యక్తిత్వ నిర్మాణానికి సాధనంగా చూడడమే నిజమైన గురువుకు దక్కే గౌరవం. నేడు విద్యా వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఉపాధ్యాయులపై పెరుగుతున్న పనిభారం, మారుతున్న విద్యా విధానాలు, వాణిజ్య ధోరణులు, సాంకేతిక పరిణామాలు, విలువల క్షీణత బోధనా ప్రక్రియపై ప్రభావం చూపుతున్నాయి. విద్యా ప్రమాణాలు తగ్గడానికి ఉపాధ్యాయులను మాత్రమే బాధ్యులను చేయడం సమంజసం కాదు. ప్రభుత్వం, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, సమాజం అందరూ విద్యాభివృద్ధిలో తమ బాధ్యతను నిర్వర్తించాలి. అయితే ఉపాధ్యాయులు కూడా కాలానుగుణంగా మారాలి.
గురువులను గౌరవించాలి
సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరస్కరించకుండా, ఉపాధ్యాయులు దానిని తమ బోధనా సామర్థ్యాన్ని పెంచుకునే సాధనంగా ఉపయోగించుకోవాలి. నిరంతర అధ్యయనం, విషయ పరిజ్ఞానం, నూతన బోధనా పద్ధతులు, డిజిటల్ నైపుణ్యాలు, మానవీయ విలువలు, ఈ అన్నింటి సమన్వయమే నేటి ఉపాధ్యాయుని గొప్పతనానికి కొలమానం కావాలి. ఉపాధ్యాయ వృత్తికి తగిన గౌరవం ఇవ్వడంతోపాటు భద్రత, స్వేచ్ఛ, అవసరమైన వనరులు కల్పించినప్పుడే ఉత్తమమైన బోధన సాధ్యమవుతుంది. అదే సమయంలో హక్కులు ఎంత ముఖ్యమో, బాధ్యతలు కూడా అంతే ముఖ్యమనే స్పృహ ఉపాధ్యాయ వృత్తికి ఉండాలి. అన్ని ఉద్యోగాల మాదిరి కాదు ఉపాధ్యాయ వృత్తి. ఒక వైద్యుడు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచితే, ఒక ఇంజినీర్ నిర్మాణాలను సృష్టిస్తాడు, కానీ ఉపాధ్యాయుడు ఒక మనిషిని, ఒక తరం భవిష్యత్తును, అంతిమంగా మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాడు. అందుకే గురువులను గౌరవిద్దాం. వారి విలువను మరింత పెంచుదాం. వారి బోధించిన విలువలను ఆచరిద్దాం.
ప్రొ. సంగని మల్లేశ్వర్
విభాగాధిపతి,
జర్నలిజం శాఖ
కాకతీయ యూనివర్సిటీ
