సాగర్ కాల్వలకు గండ్లు.. రెండు రోజుల కింద త్రిపురారం మండలంలో, తాజాగా తిరుమలగిరిలో...

సాగర్ కాల్వలకు గండ్లు.. రెండు రోజుల కింద త్రిపురారం మండలంలో, తాజాగా తిరుమలగిరిలో...

హాలియా, వెలుగు : నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని మేజర్ కాల్వలకు వరుసగా గండ్లు పడుతుండడంతో నీరు వృథాగా పోతోంది. గురువారం త్రిపురారం మండలంలోని కాల్వకు గండిపడగా.. శుక్రవారం తిరుమలగిరి సాగర్ మండలంలోని కాల్వకు గండి పడింది. సాగర్ పరిధిలోని చెరువులు, కుంటలు నింపే ఉద్దేశంతో గత నెల 26 నుంచి సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలో తిరుమలగిరి సాగర్​మండలం అల్వాల గ్రామ సమీపంలోని రాజవరం మేజర్ కాల్వకు శుక్రవారం ఉదయం భారీ గండిపడింది. దీంతో నీరంతా పంట పొలాల్లోకి వృథాగా పోయింది. విషయం తెలుసుకున్న అధికారులు సాయంత్రం గండిని పూడ్చి వేశారు. గురువారం సైతం త్రిపురారం మండలం పరిధిలోని తుంగపాడు మైనర్​కాల్వకు గండి పడడంతో రైతులు గమనించి పూడ్చివేశారు. రాజవరం, తుంగపాడు మేజర్ కాల్వలకు పడిన గండ్లను ఆఫీసర్లు పరిశీలించి శాశ్వత రిపేర్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 

రంగు మారిన సాగర్ నీళ్లు

నాగార్జునసాగర్ రిజర్వాయర్ లోని నీరు ఆకుపచ్చ రంగులోకి మారాయి. తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్న నీరు రంగు మారడంతో పాటు దుర్వాసన వస్తుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు స్పందించి నీటి శాంపిళ్లను సేకరించి టెస్ట్ చేయాలని స్థానికులు 
కోరుతున్నారు.