- మరో 40 శాతం మంది వారానికి 6 నుంచి 15 గంటలు
- తర్వాతి స్థానాల్లో తుర్కియే, ఆస్ట్రియా, అమెరికాఏడీపీ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ: ఇండియాలో కార్పొరేట్ ఉద్యోగులపై పని భారం విపరీతంగా పెరుగుతోంది. దీంతో వాళ్లు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఒక సర్వే ప్రకారం ఏకంగా 64 శాతం మంది వారానికి కనీసం 6 గంటల కంటే ఎక్కువ టైమ్‌ను ‘జీతం లేని పని’కి కేటాయిస్తున్నారని తేలింది.2025లో ప్రపంచవ్యాప్తంగా 36 ప్రధాన మార్కెట్లలోని 39 వేల మందికి పైగా ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి ఈ సర్వేను హెచ్ఆర్ రీసెర్చ్ సంస్థ ఏడీపీ విడుదల చేసింది.
దీని ప్రకారం, ఇండియాలో 24 శాతం మంది ఉద్యోగులు ప్రతి వారం 16 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం జీతం లేకుండానే పనిచేస్తున్నారు. మరో 40 శాతం మంది వారానికి 6 నుంచి 15 గంటల పాటు ఎలాంటి వేతనంమూ లేకుండా కంపెనీ పనుల కోసమే సమయాన్ని కేటాయిస్తున్నారు. అంటే దేశంలో సర్వేలో పాల్గొన్న ఉద్యోగుల్లో దాదాపు మూడింట రెండు వంతుల మంది (64 శాతం) వారానికి కనీసం 6 గంటల పాటు అదనంగా పనిచేస్తున్నట్టు స్పష్టమైంది. లంచ్ బ్రేకుల్లో కూడా పనిచేయడం, నిర్ణీత పనివేళలు ముగిసిన తర్వాత అర్ధరాత్రి వరకు ఆఫీసుల్లోనే ఉండటం లేదా ఇంటికి వెళ్లి లాగిన్ అవ్వడాన్ని సర్వే 'జీతం లేని పని'గా పరిగణించింది.
మేనేజర్ స్థాయి ఉద్యోగులపైనే పని భారం
గ్లోబల్ సగటుతో పోలిస్తే భారత్‌లోని పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సగటున 62 శాతం మంది ఉద్యోగులు వారంలో ఐదు గంటల కంటే తక్కువ టైమ్‌నే ‘జీతం లేని పని’ కి కేటాయిస్తుండగా, కేవలం 12 శాతం మంది మాత్రమే 16 గంటల కంటే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. 16 గంటలకు పైగా ఉచిత చాకిరీ చేస్తున్న ఉద్యోగుల శాతం పరంగా భారత్ (24శాతం) అగ్రస్థానంలో నిలవగా, తుర్కియే (23శాతం), ఆస్ట్రియా (21శాతం), అమెరికా (20శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
చెక్ రిపబ్లిక్‌లో కేవలం 4 శాతం, చైనా, తైవాన్, జపాన్‌లలో 6 శాతం మంది మాత్రమే ఇంత ఎక్కువ సమయం ఉచితంగా పనిచేస్తున్నట్లు రిపోర్ట్ పేర్కొంది. ఉద్యోగి హోదాను బట్టి ఈ అదనపు పనిభారం మారుతోందని సర్వే గుర్తించింది. ఉన్నత స్థాయి మేనేజర్లు, సీనియర్ లీడర్లలో దాదాపు 50 శాతం మంది వారానికి కనీసం 6 గంటలు, 20 శాతం మంది 16 గంటలకు పైగా ఉచితంగా పనిచేస్తున్నారు. సాధారణ ఉద్యోగుల్లో 16 గంటలకు పైగా శ్రమించే వారి సంఖ్య 9 శాతంగానే ఉంది. పని ప్రదేశాల వారీగా పరిశీలిస్తే, హైబ్రిడ్, ఆఫీస్ ఆధారిత ఉద్యోగుల (12శాతం) కంటే రిమోట్ వర్క్ చేసే ఉద్యోగులే (13శాతం) అదనంగా పనిచేస్తున్నారని రిపోర్ట్ పేర్కొంది.
ఓవర్ టైం వల్ల ఫాయిదా లేదు..
ఎక్కువ సమయం ఉచితంగా పనిచేయడం వల్ల ప్రొడక్టివిటీ ఏమాత్రం పెరగడం లేదని ఏడీపీ స్పష్టం చేసింది. పైగా పని గంటలు పెరిగేకొద్దీ తమ పని సామర్థ్యం తగ్గుతోందని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు వెల్లడించారు. అదనపు గంటల పనితో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. వర్క్ నచ్చినా, ఉద్యోగాన్ని వదిలేయాలని చాలామంది ఆలోచిస్తున్నారు.
