- .మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ఆదేశాలు
- ఉద్యోగులు, పెన్షనర్లకు పాత పద్ధతిలోనే వైద్యం
- రాష్ట్రవ్యాప్తంగా మరో 24 వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు పాత పద్ధతిలోనే వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. నిమ్స్ హాస్పిటల్ లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కింద అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలను గతంలోలాగే ఉచితంగా అందించాలని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ కు స్పష్టమైన సూచనలు చేశారు.
నిజానికి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. ఈహెచ్‌ఎస్ కార్డు కలిగిన వారికి నెట్‌వర్క్ హాస్పిటల్స్ లో కేవలం ఇన్‌పేషెంట్ (ఐపీ) సేవలు మాత్రమే అందుతాయి. ఓపీ సేవలను కేవలం వెల్‌నెస్ సెంటర్లలోనే పొందాల్సి ఉంటుంది. అయితే నిమ్స్ హాస్పిటల్ కు ఉన్న ప్రాముఖ్యతను దృష్ట్యా ఇక్కడకు వచ్చే ఉద్యోగులు, పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని భావించిన మంత్రి... కొత్త గైడ్ లైన్స్‌తో సంబంధం లేకుండా, నిమ్స్‌లో ఓపీ సేవలను యథావిధిగా ఉచితంగానే కొనసాగించాలని స్పష్టం చేశారు. వైద్యం కోసం వచ్చే వారు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు.
కొత్తగా మరో 24 వెల్‌నెస్ సెంటర్లు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 12 వెల్ నెస్ సెంటర్లు సేవలు అందిస్తుండగా.. వీటి సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా కొత్తగా మరో 24 వెల్‌నెస్ సెంటర్లను మంజూరు చేశామని, ఇప్పటివరకు వెల్‌నెస్ సెంటర్లు లేని అన్ని జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో అదనంగా మరో 3 వెల్‌నెస్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
కేవలం సెంటర్ల ఏర్పాటుకే పరిమితం కాకుండా, జిల్లా కేంద్రాల్లోని జనరల్ హాస్పిటళ్లకు ఈ వెల్‌నెస్ సెంటర్లను అనుసంధానించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీనివల్ల సాధారణ చికిత్సలతో పాటు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా ఉద్యోగులకు, పెన్షనర్లకు చేరువకానున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగులు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వారి జిల్లాల్లోనే నాణ్యమైన చికిత్స అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి స్పష్టంచేశారు.
