- గాంధీలో 220, ఉస్మానియాలో 145 మంది మెరిట్ స్టూడెంట్స్
- తొలి విడతలో వివిధ కాలేజీలలో 4,734 మందికి సీట్లు కేటాయింపు
- ఈనెల 8న సాయంత్రం4 గంటల్లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: 2026–-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్ ఫస్ట్ ఫేజ్ అలాట్‌మెంట్ ప్రక్రియను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో మొత్తం 6,413 సీట్లకు గానూ, తొలి విడతలో 4,734 మందికి సీట్లు కేటాయించింది. కాగా, రాష్ట్రంలోని టాప్ మెరిట్ ర్యాంకర్లు గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలనే ఎంచుకోవడం విశేషం.
ఆ రెండు కాలేజీలకే మొగ్గు..
ఫస్ట్ ఫేజ్‌లో విద్యార్థులు గాంధీ, ఉస్మానియాల వైపే మొగ్గు చూపారు. వీటితో పాటు కాకతీయ, రిమ్స్ తదితర కాలేజీలను ఎంచుకున్నారు. కేటాయించిన మొత్తం 4,734 సీట్లలో గాంధీ మెడికల్ కాలేజీలో 220 మంది, ఉస్మానియా మెడికల్ కాలేజీలో 145 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. మొత్తం 365 మంది టాప్ మెరిట్ విద్యార్థులు ఈ రెండు కాలేజీల్లోనే అడ్మిషన్లు పొందడం విశేషం.
గాంధీ కాలేజీలో 83వ ర్యాంకర్ కొంపెల్ల సాయి గాయత్రి తేజోఅరుణిమ, 158వ ర్యాంకర్ మామిడి చైతన్య, 967వ ర్యాంకర్ శ్రీపతి వైష్ణవి తదితరులు తమ సీట్లను ఖరారు చేసుకోగా, ఉస్మానియా మెడికల్ కాలేజీలో 1,064వ ర్యాంక్ సాధించిన ఎరుకుళ్ల అభిరామ్, 2,805వ ర్యాంక్ తాండ్లే వైష్ణవి, 4,381వ ర్యాంకర్ అమైర్ అనస్ తదితరులు సీటును దక్కించుకున్నారు. ఇవి కాకుండా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో 164 మంది, నిజామాబాద్ మెడికల్ కాలేజీలో 144 మంది, సిద్దిపేటలో 140 మంది, మహబూబ్‌నగర్‌లో 134 మంది, నల్గొండలో 110 మంది, సూర్యాపేటలో 105 మంది, మంచిర్యాలలో 92 మంది, ఆదిలాబాద్ రిమ్స్‌లో 89 మంది అభ్యర్థులు తమ అడ్మిషన్లను ఖరారు చేసుకున్నారు.
కేటగిరీల వారీగా అలాట్‌మెంట్లు, ర్యాంకులు ఇలా...
మొదటి విడతలో మొత్తం 4,734 సీట్లు కేటాయించగా, మిగిలిన 1,679 సీట్లను తదుపరి విడతలో భర్తీ చేయనున్నారు. ఇక కేటగిరీల వారీగా సీట్ల కేటాయింపు, కటాఫ్ ర్యాంకులు పరిశీలిస్తే.. ఓసీకి 1,175 సీట్లు కేటాయించగా (కటాఫ్ ర్యాంకు 1,62,980), ఈడబ్ల్యూఎస్‌కు 102 (88,501), బీసీ-–ఏకు 401 (3,10,517), బీసీ-–బీకి 568 (1,78,074), బీసీ–-సీకి 57 (2,70,646), బీసీ–-డీకి 401 (1,64,936), బీసీ-–ఈకి 229 (1,78,673), ఎస్సీ-–1కి 57 (6,07,920), ఎస్సీ–-2కి 516 (2,94,966), ఎస్సీ-–3కి 286 (2,41,340), ఎస్టీకి 570 (2,39,797) చొప్పున ఖరారు చేశారు. మైనార్టీ కాలేజీల్లో 372 మందికి సీట్లు లభించాయి.
ఈ నెల 8లోపు రిపోర్టింగ్ చేయాలి...
సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు తమకు కేటాయించిన మెడికల్ కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు, అలాట్‌మెంట్ ఆర్డర్, యూనివర్సిటీ ఫీజు చెల్లింపు రసీదులతో రిపోర్ట్ చేయాలని వర్సిటీ అధికారులు ఆదేశించారు. నిర్ణీత గడువులోగా రిపోర్ట్ చేయని పక్షంలో వారి అడ్మిషన్ రద్దవుతుందని, ఆ సీట్లను ఖాళీలుగా పరిగణించి మలి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు పూర్తి వివరాల కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
రాష్ట్రానికి మరో 400 మెడికల్ పీజీ సీట్లు
.హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 400 పై చీలుకు పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. నీట్ పీజీ ఎంట్రన్స్ పరీక్షలు పూర్తి కావడంతో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) టీమ్ లు రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాయి. ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం తదితర టీచింగ్ హాస్పిటల్స్ లో కనీస ప్రమాణాలు- ఉన్నాయా లేవా అని చెక్ చేశాయి.
రూల్స్ ప్రకారం బెడ్స్ సామర్థ్యం, ఇన్ పేషెంట్ లోడ్, ఫ్యాకల్టీ, ఎక్విప్‌మెంట్, టీచింగ్ ఫెసిలిటీ, రీసెర్చ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఏవైనా చిన్నపాటి లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుతామని ప్రభుత్వం హామీ ఇస్తే వెంటనే పీజీ సీట్లను మంజూరు చేస్తామని వైద్య అధికారులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 4,019 పీజీ సీట్లు ఉన్నాయి.
