పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్కు మీనాక్షి ఫోన్..కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత పరిణామాలపై అధిష్టానం ఆరా

పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్కు మీనాక్షి ఫోన్..కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత పరిణామాలపై అధిష్టానం ఆరా
  •     కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత పరిణామాలపై అధిష్టానం ఆరా
  •     పార్టీ శ్రేణుల స్పందనెలా ఉంది
  •     వరంగల్ నేతలకు సీఎం కాల్
  •     ‘ఏ బిగ్ అప్డేట్ ఈజ్ కమింగ్ సూన్’ అంటూ సురేఖ పేరుతో ఉన్న ఫేస్​బుక్ పేజీలో పోస్ట్
  •     తనకు సంబంధం లేదని కొండా క్లారిటీ

హైదరాబాద్, వెలుగు:  కొండా సురేఖ బర్తరఫ్ అనంతర పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీని ఆరా తీసినట్టు తెలిసింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్.. ఢిల్లీలోనే ఉన్న పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. కొండా సురేఖ బర్తరఫ్ పై పార్టీ క్యాడర్​లో, ప్రజల్లో, ముఖ్యంగా బీసీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వారి నుంచి ఎలాంటి స్పందన వస్తోంది?  పార్టీ నిర్ణయంపై ఆయా వర్గాలు అనుకూలంగా ఉన్నాయా? లేదంటే వ్యతిరేకంగా ఉన్నాయా? అనే విషయాలపై ఆమె ఆరా తీసినట్టు చెప్తున్నారు. పరిస్థితి అంతా పార్టీకి అనుకూలంగానే ఉందని,  కొండా బర్తరఫ్​ ద్వారా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారు ఏ స్థాయిలో ఉన్నా.. ఉపేక్షించేది లేదనే సందేశం కిందిస్థాయి దాకా వెళ్లిందని పీసీసీ చీఫ్ చెప్పినట్టు తెలిసింది. మరోవైపు ఇదే అంశంపై  సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రి సీతక్క, అక్కడి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలతో మాట్లాడినట్టు తెలిసింది. కొండా బర్తరఫ్​ తర్వాత పార్టీలో పరిస్థితి ఎలా ఉంది? కార్యకర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ జిల్లా జనం ఏ అభిప్రాయంతో ఉన్నారు? అనే విషయాలపై ఆరా తీసినట్టు తెలిసింది. దీనిపై ఇంటెలిజెన్స్ నివేదికను కూడా సీఎం రేవంత్ తెప్పించుకున్నట్టు సమాచారం.

కలకలం రేపిన ఫేస్​బుక్​పోస్ట్​ 

కొండా సురేఖ పేరుతో ఉన్న ఫేస్​బుక్​పేజీలో శుక్రవారం ఉదయం ప్రత్యక్షమైన ఓ పోస్టు  కలకలం రేపింది. ‘‘ఏ బిగ్ అప్డేట్ఈజ్ కమింగ్ సూన్’’ అంటూ వచ్చిన ఆ పోస్టును చూసి మీడియా ప్రతినిధులు, కాంగ్రెస్​ నేతలు ఒక్కసారిగా అలర్ట్​ అయ్యారు. బర్తరఫ్ అనంతరం కాంగ్రెస్​లోనే ఉంటానని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని కొండా సురేఖ స్పష్టత ఇచ్చినప్పటికీ.. సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడడంతో  సోషల్​మీడియాలో ‘కొండా దారెటు?’ అనే చర్చ జరుగుతున్నది. ఆమె బీఆర్​ఎస్​లోకి వెళ్తారని కొందరు, బీజేపీలోకి వెళ్తారని ఇంకొందరు, వైఎస్సార్సీపీలోకి లేదంటే జనసేనలోకి వెళ్తారని మరికొందరు రకరకాల వార్తలు, పోస్టులు పెడ్తున్నారు.

వాటిపై చర్చోపచర్చలు జరుగుతున్న తరుణంలో  కొండా సురేఖ పేరుతో ఉన్న ఫేస్​బుక్​పేజీలో శుక్రవారం ఉదయం  ‘‘ఏ బిగ్ అప్డేట్ఈజ్ కమింగ్ సూన్’’ అనే పోస్ట్​ప్రత్యక్షమవడంతో మీడియా ప్రతినిధులతో పాటు రాజకీయ పార్టీల నేతలంతా అలర్ట్​ అయ్యారు. ఆమె రిజైన్​ చేయబోతున్నారని.. ఫలానా పార్టీలోకి వెళ్లబోతున్నారని.. ఇలా మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ, అంతలోనే కొండా సురేఖ ప్రెస్​నోట్​రిలీజ్​చేశారు. సోషల్ మీడియాలోని పలు వేదికల్లో తన పేరుతో ఫేక్​పోస్టులు పెడ్తున్నారని, వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.  తన అధికారిక ఫేస్ బుక్, ఇన్‌‌‌‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్ లలో వచ్చే పోస్టులను మాత్రమే విశ్వసించాలని, ఇతర అకౌంట్ల నుంచి తమ పేరుతో వచ్చే వాటిని నమ్మవద్దని స్పష్టత ఇచ్చారు.