- వచ్చే ఏడాదికల్లా ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతాం
- విద్యాసంస్థలకు భూములిచ్చినోళ్లకు ఇండ్లు
- అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
- సొంత సెగ్మెంట్లో ముఖ్యమంత్రి పర్యటన
- కాలేజీలు, గురుకుల నిర్మాణాల పరిశీలన
మద్దూరు/కొడంగల్, వెలుగు: కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. మక్తల్–నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (ఎంఎన్‌కేఎల్‌ఐఎస్) పనులను 2028 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. వచ్చే ఏడాది మార్చిలోపు కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులను పూర్తి చేసి, నెక్ట్స్ అకడమిక్ ఇయర్ నుంచే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల నిర్మాణాలకు భూములిచ్చిన రైతులను గుర్తించి వెంటనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. నారాయణపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలోని కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న మద్దూరు, దౌల్తాబాద్, దుద్యాల మండలం హకీంపేటలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. డిగ్రీ కాలేజీలు, గురుకులాలు, కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులను పరిశీలించారు.
కొడంగల్ లిఫ్ట్‌కు 2028 డెడ్లైన్
మక్తల్–నారాయణపేట–-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (ఎంఎన్ కేఎల్ఐఎస్) పనులను 2028 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టు పురోగతిపై హకీంపేటలో ఆఫీసర్లతో సమీక్షించారు. ముందుగా గత సమీక్షలో సీఎం సూచన మేరకు.. పథకంలోని పంప్హౌస్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్టు అధికారులు వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఎంఎన్కేఎల్ఐఎస్ ఫేజ్-–2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని సూచించారు. పనుల్లో వేగం పెంచేందుకు ప్రతి ఏడాది అవసరమైన బడ్జెట్కు సంబంధించి పూర్తి వివరాలను అందించాలన్నారు. పెండింగ్ భూసేకరణ పనులను పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న ఫేజ్-–1 పనులను 2027 డిసెంబర్ నాటికి, ఫేజ్–-2 పనులను 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
నాణ్యతలో రాజీపడితే చర్యలు..
హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా నియోజరవర్గంలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ విద్యా సంస్థలను మంజూరు చేశామని, వాటికి సొంతంగా నూతన భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నిర్మాణాలన్నీ భవిష్యత్తులో విద్యా అవసరాలకు తగ్గట్టుగా ఉండాలన్నారు. అందుకే పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి, వచ్చే ఏడాది మార్చి వరకు డెడ్లైన్ పెట్టుకొని పూర్తి చేయాలన్నారు. భవనాలు ఇరుకుగా ఉండొద్దని, అవసరమైన అదనపు భూములను తీసుకోవాలని ఆదేశించారు. ఆ నిర్మాణాల పక్కనే ఉన్న భూములను సర్వే చేయాలన్నారు. అవి పట్టా ల్యాండ్ అయితే వాటిని కొనుగోలు చేయాలని తెలిపారు. ప్రతి కాలేజీ విశాలంగా ఉండాలని, కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షాల సమయంలో కాలేజీల ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి ల్యాండ్ స్కేపింగ్ పనులకు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. విద్యా సంస్థల కోసం చాలా మంది రైతులు వారి భూములను ఇచ్చారని, వెంటనే వారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
పర్యటిస్తూ.. సూచనలిస్తూ..
సీఎం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి బయల్దేరి నారాయణపేట జిల్లా మద్దూరులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా మద్దూరులో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా కాలేజీల నిర్మాణానికి సంబంధించిన నక్షాలను పరిశీలించి, నిర్మాణ పనులపై ఆరా తీశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోకఫస్లాబాద్ గ్రామానికి చేరుకొని, నిర్మాణంలో ఉన్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు.
అలాగే, దౌల్తాబాద్ మండల కేంద్రంలో గవర్నమెంట్జూనియర్కాలేజీ భవన నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి దుద్యాల మండలం హకీంపేటలోని కొడంగల్ఎడ్యుకేషన్ హబ్‌ను సందర్శించారు. నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ మెడికల్ నర్సింగ్ కాలేజీ, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు, 430 బెడ్ల హాస్పిటల్, ఇతర నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ పనులపై ఆఫీసర్లకు పలు సూచనలు, సలహాలు చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా డిపార్టమెంట్ల ఆఫీసర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం కొడంగల్లోని తన నివాసానికి బయల్దేరి వెళ్లారు.
