- ఒక్క రోజు ట్రయల్‌తో ప్రతికూల నిర్ణయం తీసుకోవద్దు: ఎంపీ వంశీకృష్ణ
- ఉత్తర తెలంగాణ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఈ ట్రైన్లు అవసరం
- వందే భారత్ హాల్టింగ్‌తో రైల్వే ఆదాయం పెరిగిందని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: సికింద్రాబాద్-–సిర్పూర్ కాగజ్‌నగర్ (07235), సిర్పూర్ కాగజ్‌నగర్–-హైదరాబాద్ (07236) మధ్య నడిపిన జన్ సాధారణ్ స్పెషల్ ట్రైన్లను రెగ్యులర్‌గా నడపాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే మంత్రిత్వ శాఖను కోరారు. ఒక్క రోజు ట్రయల్ పేరుతో ఈ రైళ్లపై ప్రతికూల నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తర తెలంగాణ-–హైదరాబాద్ మధ్య రైలు కనెక్టివిటీ పెంచాలని ఆగస్టు 8న రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీశ్ కుమార్‌ను కలిసి కోరినట్లు గుర్తు చేశారు. దాదాపు 13 ఏండ్ల కిందట నడిచిన సిర్పూర్ కాగజ్‌నగర్-–హైదరాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను తిరిగి నడపాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, కాజీపేట, జనగాం, భువనగిరి, చర్లపల్లి స్టేషన్లలో హాల్టింగ్ ఉండేలా రైలు నడపాలని కోరినట్లు తెలిపారు.
ఎంపీ విజ్ఞప్తి మేరకు ఈ పది స్టేషన్లలో హాల్టింగ్‌తో సిర్పూర్ కాగజ్‌నగర్-–హైదరాబాద్ మధ్య రైల్వే బోర్డు ట్రయల్ నిర్వహించిందని చెప్పారు. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జన్ సాధారణ్ పేరుతో స్పెషల్ ట్రైన్లను నడిపిందన్నారు. ఇది దశాబ్దానికి పైగా ఉన్న ప్రజల డిమాండ్ అని, ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఉంటుందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణను హైదరాబాద్‌తో అనుసంధానం చేయడం వల్ల పెద్దపల్లి పార్లమెంట్ పరిధితో పాటు ఇతర ప్రాంతాల్లో మౌలిక వసతులు పెరుగుతాయని వంశీకృష్ణ అన్నారు. దీంతో ప్రాంతీయ అభివృద్ధి వేగం పుంజుకోవడంతో పాటు రైల్వేకు కూడా ఆదాయం పెరుగుతుందని చెప్పారు. రెగ్యులర్ రైలు సాధించే విషయంలో వెనక్కి తగ్గేది లేదని, సర్వీస్ ప్రారంభమయ్యే వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. ట్రయల్ రన్‌పై అధికారులతో సమీక్షించి రైళ్లను రెగ్యులర్‌గా నడిపేలా కృషి చేస్తానన్నారు.
వందే భారత్‌తో పెరిగిన ఆదాయం
పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు స్టేషన్లలో వందే భారత్‌కు హాల్టింగ్ ఇవ్వాలని గతంలో కేంద్రాన్ని కోరినట్లు ఎంపీ తెలిపారు. తొలుత రామగుండంలో మాత్రమే హాల్ట్ ఇచ్చారని, మంచిర్యాలలోనూ నిలిపితే ప్రయాణికుల సంఖ్య, రైల్వే ఆదాయం పెరుగుతుందని పార్లమెంట్‌లో కోరినట్లు చెప్పారు. అనంతరం మంచిర్యాలలోనూ వందే భారత్‌కు హాల్ట్ ఇచ్చారని, దీంతో రైల్వే ఆదాయం పెరిగిందని గుర్తు చేశారు. ఇదే విధంగా ఉత్తర తెలంగాణ- హైదరాబాద్ మధ్య రెగ్యులర్ రైలు నడిపితే స్థానిక ప్రాంతాల అభివృద్ధితో పాటు రైల్వేకు భారీగా ఆదాయం వస్తుందని వంశీకృష్ణ పేర్కొన్నారు.
