హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియలో కాళోజీ హెల్త్ వర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన 12 మంది అభ్యర్థులకు రాష్ట్ర ఎస్టీ రిజర్వేషన్ వర్తించదని తేల్చి చెప్పింది. 2026-–27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా సీట్ల భర్తీలో భాగంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు చేపట్టింది. కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ అభ్యర్థులందరినీ ఎస్టీ కోటా నుంచి తొలగించి, ఓపెన్ కేటగిరీలోకి మారుస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస వెళ్లిన వ్యక్తులు అక్కడ లోకల్ రిజర్వేషన్ ప్రయోజనాలు పొందేందుకు అర్హులు కారని 1990లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.అందుకే రాథోడ్ అజయ్ నాయక్, సమీక్ష, దత్ ప్రసాద్ సహా 12 మందిని ఎస్టీ రిజర్వేషన్ల నుంచి తప్పించారు.
