- రాహుల్‌ను ప్రధానిని చేయడమే మా అందరి లక్ష్యం
- కాళేశ్వరం రీడిజైన్ పేరుతో లక్ష కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేసిండు
- కేటీఆర్ఫెయిల్డ్లీడర్.. అతడి వల్లే బీఆర్ఎస్‌కు వరుస ఓటములు
- యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం కేటీఆర్, బాల్క సుమన్‌కు అలవాటు
- ఫారిన్ జాబ్స్ కోసం యువత జర్మన్ నేర్చుకుంటే బీఆర్ఎస్నేతలు ఎగతాళి చేస్తున్రు
- కాంగ్రెస్1000 రోజుల పాలనపై మీడియాతో మాట్లాడిన మంత్రి
కోల్‌బెల్ట్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. అంతా కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసి, రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంచిర్యాలలో కాంగ్రెస్ నేత మంతెన జగన్‌మోహన్ రావు ఇంట్లో మీడియా సమావేశంలో కాంగ్రెస్వెయ్యి రోజుల పాలనపై మంత్రి మాట్లాడారు. రెండేన్నరేళ్ల కాంగ్రెస్‌పాలన సూపర్ హిట్అయ్యిందన్నారు.
మహిళలకు ఫ్రీ బస్సు, వడ్డీలేని రుణాలు, రూ.500 సబ్సిడీ గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ పవర్ అందించామని, రైతు బీమా, రుణమాఫీ, రైతు భరోసాతో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పారు. పదేండ్లలో బీఆర్ఎస్ ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. కేసీఆర్‌రూ. 8లక్షల కోట్ల అప్పు చేస్తే దానిమీద తమ ప్రభుత్వం రెండున్నరేండ్లలో రూ.3 లక్షల కోట్ల మిత్తి కట్టిందన్నారు. అప్పట్లో రైతులు వరి వేయొద్దని చెప్పిన కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో మాత్రం వరిసాగు చేశాడని విమర్శించారు. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో లక్ష కోట్ల ప్రజాధానాన్ని కేసీఆర్ వృధా చేశాడని మండిపడ్డారు. కమీషన్లకు ఆశపడి కాళేశ్వరం ప్రాజెక్టు కడ్తే మూడేండ్లకు కుంగిపోయిందని, కాంగ్రెస్ హయాంలో కట్టిన ఒక్క ప్రాజెక్ట్ అయినా చెక్కుచెదిరిందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుడిసెలు, పెంకుటిల్లు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని, ఇప్పటికే రెండు లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చామన్నారు.
కేటీఆర్ ఫెయిల్డ్ లీడర్..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ఫెయిల్డ్ లీడర్ అని, అతడి అసమర్థత వల్లే బీఆర్ఎస్ పార్లమెంటు, అసెంబ్లీ, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోయిందని వివేక్ అన్నారు. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతానికి చెందిన డీఎంఎఫ్టీ నిధులను హరీశ్ రావు సిద్దిపేటకు తరలించుకొని వెళ్లి ఈ ప్రాంత ప్రజలకు తీరని నష్టం చేశారన్నారు. జర్మనీ భాషపై శిక్షణ ఇచ్చి స్కిల్స్ ఉన్న యువతకు రూ. 25 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం టామ్ కామ్ద్వారా చర్యలు తీసుకుంటోందన్నారు. ఉద్యోగాలు పొందాలనే ఆశతో యువత జర్మనీ భాషను నేర్చుకుంటే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎగతాళి చేయడం సరికాదన్నారు.
గతంలో ఇదే తీరుతో కేటీఆర్ జర్మనీ, జపనీస్ భాషలు మనకెందుకు అంటూ చులకనగా మాట్లాడారని గుర్తు చేశారు. బాల్క సుమన్ సింగరేణి భవనాన్ని కాలబెట్టాలి... రైల్వే పట్టాలు కోయాలి.. కేసులు పైన వేసుకోవాలి.. అంటూ యువతను రెచ్చగొట్టారన్నారు. యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం కేటీఆర్, బాల్క సుమన్‌కు అలవాటేనన్నారు. సమావేశంలో డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి, పార్టీ నేత మంతెన జగన్‌మెహన్‌రావు, మాజీ మున్సిపల్ చైర్మన్లు రావుల ఉప్పలయ్య, సురిమిల్ల వేణు, మాజీ కౌన్సిలర్ అగల్‌డ్యూటీ రాజు, మంచిర్యాల కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
