- తాగు అవసరాలకోసమే పవర్ జనరేషన్ అన్న మన ఆఫీసర్లు
- కరెంటు ఉత్పత్తి ఆపితే సాగర్ నుంచి తాగు నీళ్లు వచ్చేదెలా?
- ఎల్‌నినో ఉన్నందున 50:50 రేషియోలో పంచాలని విజ్ఞప్తి
- పట్టించుకోని కేఆర్ఎంబీ.. ఎటూ తేలకనే ముగిసిన మీటింగ్
- వచ్చే నెల నాలుగో వారంలో మరో మారు బోర్డు సమావేశం
హైదరాబాద్, వెలుగు: మన తాగునీళ్లకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ (కేఆర్‌ఎంబీ) బోర్డు కత్తెర వేసింది. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి వద్దంటూ నాగార్జున సాగర్‌కు నీళ్లు వెళ్లకుండా అడ్డుపడుతున్నది. బోర్డు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణకు నీటి కష్టాలను తీసుకొచ్చేలా ఉన్నది. కృష్ణా జలాల వినియోగం విషయంలో బోర్డు ఏకపక్షంగా వ్యవహరించింది. ఏపీ అడిగిందే తడవుగా రాష్ట్ర ప్రయోజనాలకు గండిపడేలా ఆంక్షలు విధించింది. ఏపీ నీళ్లన్నీ ఎత్తుకుపోతున్నా ఆ రాష్ట్రాన్ని పల్లెత్తు మాట అనకుండా.. తెలంగాణకు మాత్రం కఠిన ఆదేశాలిచ్చింది. విద్యుదుత్పత్తి కోసమే కట్టిన శ్రీశైలం జలాశయం నుంచి ఆ పని వెంటనే ఆపాలంటూ హుకుం జారీ చేసింది.
ట్రిబ్యునల్అవార్డు ప్రకారం నడుచుకోవాల్సిన బోర్డు.. అందుకు విరుద్ధంగా విభజనచట్టంలోని అంశాన్ని లేవనెత్తింది. ఏపీ చెప్పినట్టే బోర్డు తలూపింది. కృష్ణా జలాల వినియోగంపై శుక్రవారం జలసౌధలో నిర్వహించిన త్రీ మెంబర్ కమిటీ మీటింగ్‌లో బోర్డు ఏకంగా ఏపీ స్టాండ్ తీసుకొని మాట్లాడింది. బచావత్ ట్రిబ్యునల్అవార్డు ప్రకారం.. శ్రీశైలం ప్రాజెక్టును కేవలం జలవిద్యుదుత్పత్తి కోసమే వాడుకోవాలి. ఇక్కడి నుంచి తాగు, సాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌కు 264 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. కానీ, కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీ మాత్రం విద్యుదుత్పత్తి చేయొద్దంటూ తెలంగాణకు ఆదేశాలిచ్చారు.
మీటింగ్‌లో చెప్పడమే కాదు.. మీటింగ్ అయిపోగానే పవర్ జనరేషన్ ఆపేయాలంటూ ప్రత్యేకంగా తెలంగాణకు బోర్డు లేఖ కూడా రాసింది. ఏపీ విభజనచట్టంలోని షెడ్యూల్11 ప్రకారం శ్రీశైలం నదీ జలాలను ప్రత్యేకంగా విద్యుదుత్పత్తి కోసమే వాడుకోరాదంటూ ఆ లేఖలో పేర్కొన్నది. ఇరిగేషన్, విద్యుదుత్పత్తిలో దేనికీ ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రశ్న తలెత్తినప్పుడు.. కచ్చితంగా ఇరిగేషన్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. అదే సమయంలో ఇరిగేషన్ లేదా తాగునీటికి ఇవ్వాలా అన్న అంశం వచ్చినప్పుడు కచ్చితంగా తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులున్న నేపథ్యంలో విభజనచట్టం ప్రకారం విద్యుదుత్పత్తి చేయరాదని లేఖలో మనకు బోర్డు సూచించింది. రెండు ప్రాజెక్టుల్లోని నీళ్లను జాగ్రత్తగా వాడుకోవాలని పేర్కొన్నది. అదే సమయంలో పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును నియంత్రించాలని గట్టిగా చెప్పాల్సిన బోర్డు.. మమ అనిపించింది.
విద్యుదుత్పత్తి ఆపేది లేదన్న తెలంగాణ ఈఎన్సీ
త్రీ మెంబర్ కమిటీ మీటింగ్‌లో శ్రీశైలం పవర్ జనరేషన్‌పైనే ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మన రాష్ట్రం విచ్చలవిడిగా నీటిని వృథా చేస్తున్నదంటూ మెంబర్సెక్రటరీకి తెలియజేసింది. దీనిపై మన ఈఎన్సీ ఏపీకి గట్టి కౌంటర్ఇచ్చారు. తామేమీ వృథాగా పవర్ జనరేషన్ చేయడం లేదని తేల్చి చెప్పారు. శ్రీశైలం నుంచి తాము నీళ్లు తీసుకెళ్లలేమని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద తాగునీటి అవసరాలను తీర్చుకునేందుకే శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి విచ్చలవిడిగా నీటిని తరలిస్తున్నదని, దానికి ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు కూడా తోడైందని అభ్యంతరం తెలిపారు. ముందు వాటిపై నియంత్రణ విధించాలని, నీటి తరలింపులను ఆపాలని బోర్డు మెంబర్ సెక్రటరీకి తేల్చి చెప్పారు. సాగర్ కింద తాగునీటి అవసరాలు తీర్చేలా చెరువులు నింపేందుకు శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేసి తీరుతామని ఆయన గట్టిగా వాదించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి పంపకాలు 50:50 నిష్పత్తిలోనే చేయాలన్నారు. బేసిన్‌లోని జనాభా నిష్పత్తి ఆధారంగా జలాలను పంచాలని కోరారు. వచ్చే ఏడాది ఆగస్టు వరకు తమకు 200 టీఎంసీల నీళ్లు అవసరమని, అందులో 46 టీఎంసీలు తాగునీటికి కావాలని స్పష్టం చేశారు.
మళ్లీ పాత ముచ్చటే అందుకున్న ఏపీ
ఏపీ శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తిపై అక్కసు వెళ్లగక్కడంతో పాటు కేసీఆర్హయాంలో చేసుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని తెరపైకి తెచ్చింది. నాడు చేసుకున్న 66:34 నిష్పత్తిలోనే నీటి పంపకాలు చేయాలని వాదించింది. వచ్చే ఏడాది ఆగస్టు వరకు 104 టీఎంసీలను ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం ఉన్న నీళ్లలో 97.41 టీఎంసీలు తమవేనని వాదనకు దిగింది. రెండు రాష్ట్రాల వాదనలు విన్న బోర్డు మెంబర్‌సెక్రటరీ.. ఎల్‌నినో నేపథ్యంలో కేవలం తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కాగా, రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బోర్డు మీటింగ్‌లోనే తేల్చాలని నిర్ణయించారు. ఈ నెల నాలుగో వారంలో 21వ బోర్డు మీటింగ్నిర్వహిస్తామని, అందులోనే ఈ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని బోర్డు మెంబర్‌సెక్రటరీ తెలిపారు.
ఇప్పటికే 27 టీఎంసీలు మళ్లించిన ఏపీ
లోటు సంవత్సరంలోనూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ జలదోపిడీకి అడ్డు లేకుండా పోతున్నది. ఈ ఏడాది వరదలు సరిగ్గా మొదలు కాకముందే పోతిరెడ్డిపాడు తలుపులు తెరిచింది. ఈ ఏడాది ఇప్పటివరకూ పోతిరెడ్డిపాడు నుంచి 20.20 టీఎంసీలను తరలించింది. అందులో చెన్నై వాటర్ సప్లైకి 3.30 టీఎంసీలు తీసేస్తే.. ఏపీ తన కోసం తరలించుకున్న నీళ్లు 16.9 టీఎంసీలు కావడం గమనార్హం. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన నాలుగైదు రోజుల్లోనే ఒక టీఎంసీ నీటిని తీసుకెళ్లిపోయింది. మల్యాల లిఫ్ట్ నుంచి 7 టీఎంసీలు మళ్లించింది. మొత్తంగా ఒక్క శ్రీశైలం నుంచే ఏపీ 27.180 టీఎంసీల జలాలను మళ్లించుకున్నది. సాగర్ ప్రాజెక్టునూ వదల్లేదు. కుడి కాల్వ ద్వారా 12 టీఎంసీల జలాలను తీసుకుపోయింది. అదే సమయంలో మన రాష్ట్రం మాత్రం శ్రీశైలంలో వాడుకున్న నీళ్లు కేవలం 7.8 టీఎంసీలు కాగా.. సాగర్ ఎడమ కాల్వ ద్వారా 6 టీఎంసీలు, హైదరాబాద్‌వాటర్ సప్లై కోసం 4.35 టీఎంసీలు, ఏఎమ్మార్పీ ద్వారా 4.18 టీఎంసీల నీళ్లను కేవలం తాగునీటి కోసం తీసుకెళ్లింది. మొత్తంగా ఏపీ ప్రకాశం బ్యారేజీ/కృష్ణా డెల్టా స్కీమ్ (25.34 టీఎంసీలు) తరలింపులు, తుంగభద్ర (5 టీఎంసీలు) కలుపుకుంటే ఇప్పటివరకు 70 టీఎంసీలను వాడుకుంది. తెలంగాణ జూరాల ప్రాజెక్టు (18 టీఎంసీలు) సహా వాడుకున్న నీళ్లు 45.54 టీఎంసీలు. అంటే ఏపీ 60.66 శాతం, తెలంగాణ 39.34 శాతం చొప్పున నీళ్లు వాడుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కామన్ రిజర్వాయర్లలో ఉన్న 136.478 టీఎంసీల నీళ్లను తెలంగాణకు 71 శాతం, ఏపీకి 29 శాతం చొప్పున పంచాలని త్రీ మెంబర్ కమిటీ మీటింగ్‌లో తేల్చి చెప్పింది. ఆ లెక్కన ఏపీకి నీళ్లేమీ ఉండబోవని స్పష్టం చేసింది. అయితే, ఎల్‌నినో పరిస్థితులున్న నేపథ్యంలో ఇప్పటిదాకా వాడుకున్న నీళ్లనూ పరిగణనలోకి తీసుకొని 50:50 రేషియోలో నీళ్లు ఇవ్వాలని, ఇప్పుడున్న నిల్వలో తెలంగాణకు 102.07 టీఎంసీలు, ఏపీకి 34.41 టీఎంసీలను ఇవ్వాలని స్పష్టం చేసింది.
ట్రిబ్యునల్ తీర్పులు కాదని..
వాస్తవంగా శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించిందే విద్యుదుత్పత్తి కోసం. విద్యుదుత్పత్తి ద్వారా సాగర్ ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేసి.. అక్కడి ఆయకట్టు, తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కూడా ఇదే స్పష్టం చేసింది. కానీ, ఆ తర్వాత ఏపీ పాలకులు శ్రీశైలం ప్రాజెక్టు ఉద్దేశాన్నే మార్చేశారు. చెన్నై డ్రింకింగ్ వాటర్ సప్లై పేరిట మొదలైన మార్పు.. పోతిరెడ్డిపాడు, తెలుగు గంగ ప్రాజెక్టు, హంద్రీ నీవా, గాలేరునగరి, వెలిగొండలాంటి ప్రాజెక్టులు కట్టేసి ఇరిగేషన్ అవసరాలకు మళ్లిస్తున్నారు. ఏటా ఏపీ వందల కొద్దీ టీఎంసీల నీళ్లను అక్రమంగా తరలించుకుపోతున్నా బోర్డు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నది. కానీ, ఇప్పుడు తెలంగాణ తాగునీటి అవసరాలు తీర్చేందుకుగాను శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేసి సాగర్ కింద ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.. ఏపీ అడ్డుపుల్లలు వేస్తున్నది. ఆ రాష్ట్రానికి బోర్డు వంత పాడుతున్నది. ట్రిబ్యునల్ తీర్పులను పట్టించుకోకుండా.. ఏకపక్షంగా కేవలం విభజనచట్టంలో పేర్కొన్న అంశాలనే పరిగణనలోకి తీసుకున్నది. మనకు న్యాయంగా దక్కాల్సిన నీళ్ల విషయంలో అడ్డుకట్ట వేస్తూ.. ఏపీకి నీళ్లు పారించే ప్రయత్నాలకు పూనుకుంటున్నదన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
