- ఆమెను బీజేపీలోకి ఆహ్వానించే అంశంపై పార్టీలో చర్చ జరగలేదు: ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్, వెలుగు: కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం పట్ల బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత రాజకీయ విభేదాలే ఆమె పదవి కోల్పోవడానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం నిజంగా బాధ కలిగించిందన్నారు. రాజకీయాల్లో గ్రూప్ తగాదాలు సాధారణమని, కాంగ్రెస్‌లో వాటిని రోజూ చూస్తున్నామని డీకే అరుణ పేర్కొన్నారు.
2009లో కొండా సురేఖ, తాను కలిసి మంత్రులుగా పనిచేశామని, తోటి మహిళా నాయకురాలు తెలంగాణకు సేవ చేస్తుంటే ఎంతో సంతోషపడ్డామని గుర్తుచేసుకున్నారు. బీసీలకు కాంగ్రెస్, సీఎం ఎంతో చేశామని గొప్పలు చెప్పుకునేవారే..ఇప్పుడు ఓ బీసీ మహిళా నాయకురాలిని మంత్రివర్గం నుంచి తొలగించడం కరెక్ట్ కాదన్నారు. కూతురు ఏదో మాట్లాడిందనే కారణంతో తల్లి సురేఖ మీద చర్యలు తీసుకోవడం సమర్ధనీయంగా లేదన్నారు.రాజకీయాల్లో ఒక మహిళ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి రావడమనేది గొప్ప విషయమన్నారు. కొండా సురేఖను ఇప్పటివరకు బీజేపీలోకి ఆహ్వానించే ఎలాంటి చర్చలూ జరగలేదని డీకే అరుణ స్పష్టం చేశారు.
