- రామప్ప, బుద్ధవనం, అనంతగిరి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, హరిత హోటళ్లలో చేపట్టిన మౌలిక వసతుల కల్పన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. శుక్రవారం ఇంజినీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో ప్రాజెక్టుల ప్రగతిపై ఆమె సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్పతోపాటు నిజాంసాగర్, బుద్ధవనం, భువనగిరి కోట, అనంతగిరి హిల్స్ తదితర ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నివేదికల ఆధారంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు, సుందరీకరణ, విద్యుద్దీకరణ, సివిల్ పనులను వేగవంతం చేయాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించాలని చెప్పారు. కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను తక్షణమే పరిష్కరించుకోవాలన్నారు. పర్యాటకులకు మెరుగైన ఆతిథ్యం అందించేలా హరిత హోటళ్లను తీర్చిదిద్దాలని చెప్పారు. పర్యాటక అభివృద్ధి కేవలం భౌతిక వసతుల కల్పనకే పరిమితం కాకుండా, స్థానికుల జీవనోపాధిని మెరుగుపరిచేలా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
