BCCI Chief Selector: అజిత్ అగార్కర్ నాయకత్వంలోని భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ భవిష్యత్తుపై ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇటీవల ముంబైలో జరిగిన బీసీసీఐ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశానికి అగార్కర్ గైర్హాజరు కావడం, అతడి పదవి నుంచి తప్పుకుంటున్నారనే ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. కానీ, అగార్కర్ తొలగింపు వార్తలను బీసీసీఐ ఇంకా ధృవీకరించలేదని, ఈ భేటీలో సెలెక్టర్ల మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జాయింట్ సెక్రటరీ దేవ్‌జీత్ సైకియా స్పష్టం చేశారు. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత జట్టును ఎంపిక చేయడంలో చీఫ్ సెలెక్టర్ పాత్ర అత్యంత కీలకంగా మారింది.
చీఫ్ సెలెక్టర్ కావాలంటే కఠిన రూల్స్:
టీమిండియాను ఎంపిక చేసే సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కావడానికి బీసీసీఐ కొన్ని కఠినమైన నిబంధనలను పొందుపరిచింది. ఈ హాట్ సీట్ కోసం దరఖాస్తు చేసుకునే మాజీ క్రికెటర్ అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుని కనీసం ఐదేళ్లు పూర్తి చేసుకుని ఉండాలి.. దీంతో పాటు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాల్సిందే. ఒకవేళ ఇవి లేకపోతే మొత్తంగా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండటం తప్పనిసరి.. అంతేకాకుండా, దరఖాస్తుదారు బీసీసీఐ కింద ఉన్న ఏ ఇతర కమిటీలోనూ మొత్తంగా 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సభ్యుడిగా ఉండొద్దు.
బీసీసీఐ రూల్స్ కు పక్కాగా సరిపోయిన అగార్కర్:
బీసీసీఐ నిర్దేశించిన నిబంధనలన్నింటికీ సంపూర్ణంగా సరిపోవడంతోనే 2023లో అజిత్ అగార్కర్ ఈ కీలక బాధ్యతలను చేపట్టారు. 2013 అక్టోబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అగార్కర్, భారత జట్టు తరఫున 191 వన్డేలాడి 288 వికెట్లు పడగొట్టడమే కాకుండా 1269 పరుగులు సాధించారు. అలాగే 26 టెస్టుల్లో 58 వికెట్లు, 4 టీ20లు ఆడిన అనుభవం ఆయనకు ఉంది. బీసీసీఐ అర్హత ప్రమాణాలకు సరిపోవడంతోనే ఎంపిక మండలి అధ్యక్షుడిగా అగార్కర్‌కు ఈ బాధ్యతలు దక్కాయి.
►ALSO READ | యేహ్ కౌన్ హై: ఆ అతిథి కాళ్లని ధోనీ ఎందుకు మొక్కాడు? అసలు కథేంటి!
చరిత్రలో 10 మందికే అవకాశం:
భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం 10 మంది దిగ్గజాలు మాత్రమే భారత చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించడం ఈ పదవికి ఉన్న ప్రాధాన్యతను చాటుతోంది. అగార్కర్‌కు ముందు చేతన్ శర్మ 2022–23 వరకు ఈ పదవిలో కొనసాగగా, మధ్యలో శివ సుందర్ దాస్ తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తించారు. దేశవాళీ క్రికెట్‌లో ప్రతిభ ఉన్న ఆటగాళ్లను గుర్తించి, భారత క్రికెట్ భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ పదవిని దక్కించుకోవడం, నిర్వహించడం మాజీ ఆటగాళ్లకు సైతం ఎంతో సవాలుతో కూడుకున్నది.
