కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరం.. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా వేటు తప్పదు: మహేష్ గౌడ్

కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరం.. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా వేటు తప్పదు: మహేష్ గౌడ్

హైదరాబాద్: కేబినెట్ నుంచి కొండా సురేఖ బర్తరఫ్‎పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (సెప్టెంబర్ 4) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖ బర్తరఫ్ బాధకరమని అన్నారు. ఆమె పలుమార్లు పార్టీ లైన్ దాటి మాట్లాడారని.. గతంలో కూడా ఆమెపై ఫిర్యాదులు వస్తే సీఎంతో చర్చించి పరిష్కరించానని తెలిపారు. ఈ సారి నా చేతుల్లో ఏమి లేదని స్పష్టం చేశారు. కూతురు చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించి ఉండాల్సిందని.. ఖండించకపోవడం వల్లే ఏఐసీసీ తీవ్రంగా పరిగణించిందని పేర్కొన్నారు. 

ఇప్పటికీ కొండా సురేఖ పార్టీలో కొనసాగాలని కోరుకుంటున్నామని చెప్పారు.  తనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని హైకమాండ్‏ను సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశాడన్న సురేఖ ఆరోపణలను మహేష్ గౌడ్ ఖండించారు. ఎవరినీ బ్లాక్‌మెయిల్‌ చేయాల్సిన అవసరం సీఎంకు లేదని వివరణ ఇచ్చారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని.. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా వేటు తప్పదని హెచ్చరించారు. లీడర్లు తమ సమస్యలు, ఇబ్బందులపై మాట్లాడేందుకు పార్టీలోనే ఎన్నో వేదికలు ఉన్నాయని.. బహిరంగంగా మాట్లాడటం క్షమించరాని తప్పని అన్నారు. 

కేబినెట్ నుంచి కొండా ఔట్:

రేవంత్ రెడ్డి కేబినెట్ నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ కుమార్తె సుష్మిత సీఎం రేవంత్, ఆయన ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తన కుమార్తె వ్యాఖ్యలను ఖండించకపోగా.. తనకు నోటీసులు ఇవ్వడాన్ని సురేఖ తప్పుబట్టింది. చివరకు కొండా ఎపిసోడ్ ఏఐసీసీకి చేరింది. పార్టీ లైన్ దాటిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని కోరారు.

ALSO READ : KTR ఫెయిల్డ్ లీడర్.. అతడి వల్లే బీఆర్ఎస్‎కు వరుస ఓటములు

 ఆమెపై చర్యలు తీసుకోకుంటే పార్టీ, ప్రభుత్వంలో అసమ్మతి రాగం పెరుగుతుందని అధిష్టానికి వివరించారు. పీసీసీ నివేదిక, సీఎం రేవంత్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ఏఐసీసీ కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ సురేఖను తన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ కు సిపార్సు చేశారు. సీఎం సిపార్సు మేరకు కొండా సురేఖను మంత్రి మండలి నుంచి గవర్నర్ తొలగించారు.