కోల్కతా: టీఎంసీ కీలక నాయకురాలు, ఎంపీ మహువా మొయిత్రాకు మరో బిగ్ షాక్ తగిలింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయ్యింది. కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల ఉత్తర బెంగాల్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై ఎంపీ మహువా మొయిత్రా సంచలన ఆరోపణలు చేసింది.
అమిత్ షా మీటింగ్కు రాష్ట్రానికి చెందిన ముస్లిం ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను దూరం పెట్టారని ఆరోపించారు. సిలిగురి పోలీస్ కమిషనర్ వకార్ రాజా, ఎస్‌టిఎఫ్ డీజీ జావేద్ షమీమ్, ఐఏఎస్ ఖలీల్ అహ్మద్ అనే ముగ్గురి పేర్లను ఆమె ప్రస్తావించారు. మైనారిటీ వర్గాలకు చెందిన అధికారులను ఉద్దేశపూర్వకంగానే తప్పించారని ఆరోపించారు. ఈ క్రమంలో మహువా వ్యాఖ్యలపై డైమండ్ హార్బర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది.
►ALSO READ | నెలకు రూ.80వేలు సంపాదిస్తే పేదరికంతో సమానమా? ముంబై కంటెంట్ క్రియేటర్ హెచ్చరిక
మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరాడు. ఈ ఫిర్యాదు మేరకు డైమండ్ హార్బర్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 196, 197, 299, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆమెకు సమన్లు జారీ చేశారు.
