అష్టమి రోజు కృష్ణుడి లీల.. తొమ్మిది రోజులు.. చీకటి సొరంగంలో.. ‘హరే కృష్ణ మహా మంత్రం’ బతికించిందా..?

అష్టమి రోజు కృష్ణుడి లీల.. తొమ్మిది రోజులు.. చీకటి సొరంగంలో.. ‘హరే కృష్ణ మహా మంత్రం’ బతికించిందా..?

నేపాల్‌ వరదల్లో ప్రాణాలతో ఉన్న వారి కోసం తమ వాళ్లు వెతుకులాట సాగిస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది వారికి సాయం చేస్తున్నారు. అలా ఇద్దరు వ్యక్తులు దాదాపు తొమ్మిది రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరిని రక్షించారు. ఇద్దరినీ కాపాడి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రాణాపాయ స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తూ తాను ' హరే కృష్ణ మహామంత్రాన్ని ' జపిస్తూనే ఉన్నానని మెకానికల్ ఇంజనీర్ సంజయ్ సాహ్‌ చెప్పాడు. సంజయ్కు ఈ పరిణామం పునర్జన్మేనని చెప్పడంలో అతిశయోక్తి లేదు. త్రిశూలి-3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు సైట్‌లోని సొరంగం నుంచి కార్మికుడిగా పనిచేస్తున్న కబీర్ మహర్జన్ను కూడా రక్షించారు.

సంజయ్‌ విషయానికొస్తే.. ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఈ తొమ్మిది రోజులు పెద్ద యుద్ధమే చేశాడు. బతుకుతాననే ఆశనే అతనిని బతికించింది. నేపాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చిన సమయంలో సంజయ్ జల విద్యుత్ ప్రాజెక్టులో డ్యూటీలోనే ఉన్నాడు. కంట్రోల్ రూమ్‌కు ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు. ఆ సమయంలో సైట్‌లో సుమారు 40 నుంచి 45 మంది కార్మికులు ఉన్నారు.

సొరంగంలోకి వరద నీరు, శిథిలాలు ప్రవేశించడంతో బయటపడే పరిస్థితి కనిపించలేదని సంజయ్ చెప్పాడు. అయితే.. ఒక సీనియర్ అధికారిగా, లోపల ఉన్న ఇతర కార్మికులను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని భావించి చాలా మంది కార్మికులను బయటకు పంపించేశాడు. కానీ.. దురదృష్టవశాత్తూ సంజయ్ చివరకు జల విద్యుత్ ప్రాజెక్టులోనే చిక్కుకుపోయాడు.

సంజయ్, కబీర్ మహర్జన్.. ఇద్దరూ సొరంగంలో సుమారు 170 మీటర్ల లోపల చిక్కుకుపోయారు. తిండీతిప్పలు లేకుండా తొమ్మిది రోజులు బ్రతకడం చిన్న విషయం ఏం కాదు. మూసుకుపోయిన సొరంగంలో ఈ ఇద్దరూ అన్ని రోజులు ఎలా బ్రతకగలిగారంటే.. అక్కడ గాలి బుడగలు ఉన్నాయని.. ఆ గాలి ఇద్దరికీ ఊపిరి పోసిందని తెలిసింది.